• Mar 02, 2026
  • NPN Log

    అమరావతి : ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌పై అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించినట్టు తెలిపారు. 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నీరు సరఫరా చేయడమే లక్ష్యమని వివరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు అందించాలనే ఆలోచనతో ప్రాజెక్ట్ ముందుకు సాగుతోందని మంత్రి చెప్పారు.


    ప్రస్తుత బడ్జెట్‌లో పేజ్-1, పేజ్-2 పనుల కోసం రూ.600 కోట్లు కేటాయించామని తెలిపారు. ఉత్తరాంధ్రలోని మిగతా ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించామని తెలిపారు. వైసీపీ పాలనలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1,200 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. ఈ ఏడాదిలోనే ఎడమ కాలువ పనులను పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

    రమణయ్యపేట ఛానల్ ఆక్రమణలపై..

    రమణయ్యపేట ఛానల్ ఆక్రమణలపై ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కూడా మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. రమణయ్యపేట కాలువ ఆక్రమణలు కాకినాడ రూరల్ మండలం గుండా వెళ్తున్నట్టు తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు ఉమ్మడి సర్వే నిర్వహిస్తున్నాయని, ఇప్పటి వరకు 84 ఆక్రమణలు జరిగాయని గుర్తించినట్లు చెప్పారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయం చేసుకుని ఆక్రమణలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొన్ని చోట్ల ఇరిగేషన్ భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చాలని కోరుతున్నారన్నారు. అలా చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. డ్రైనేజి వ్యవస్థను ప్రక్షాళన చేయడంపై దృష్టి సారించామని మంత్రి తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలో డ్రైనేజి వ్యవస్థ, ఇరిగేషన్ కెనాల్‌లను మున్సిపాలిటీకి అప్పగించాలా, ఇరిగేషన్ చేయాలా అనే అంశంపై సందిగ్ధం నెలకొందని, దీనిపై సమీక్ష చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement