• Mar 02, 2026
  • NPN Log

    అమరావతి : ‘ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌’ను రద్దుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో అనాలోచితంగా తీసుకొచ్చిన కమిషన్‌ను రద్దుచేసి, పాత విధానంలో ‘ఫీజుల నియంత్రణ కమిటీ’ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీనిపై న్యాయ సలహాలు తీసుకుంటున్న ఉన్నత విద్యాశాఖ బడ్జెట్‌ సమావేశాల అనంతరం... ఆర్డినెన్స్‌ ద్వారా కమిటీని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నెల 20లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిసింది. ఎందుకంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల కాలానికి ఉన్నత విద్య కోర్సుల ఫీజులు ఖరారు చేయాల్సి ఉంది. ఫీజుల ఖరారుకు కొంత సమయం అవసరమైనందున వీలైనంత త్వరగా ఫీజుల నియంత్రణ కమిటీని తీసుకురావాలని భావిస్తోంది. 2019కు ముందు రాష్ట్రంలో ‘అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణకమిటీ’ (ఏఎ్‌ఫఆర్‌సీ) ఉండేది. వైసీపీ ప్రభుత్వం ఈ కమిటీని పక్కనపెట్టి ‘ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌’ను తీసుకొచ్చి విస్తృతమైన అధికారాలు ఇచ్చింది. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం... ఫీజుల భారాన్ని తగ్గించునేందుకు.. ఫీజులు ఎక్కువగా పెంచకుండా ఒత్తిడి చేసింది. మరోవైపు అసలు కమిషన్‌కు ఫీజుల ఖరారు అధికారం లేదంటూ పలు కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దానిపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కమిషన్‌ను రద్దుచేసి ఆ స్థానంలో కమిటీని తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిటీ ఏర్పాటు ద్వారా ఫీజుల ఖరారు విషయంలో ప్రభుత్వానికి కొంత వెసులుబాటు రానుంది. కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తులు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఫీజులు నిర్ణయించే పరిస్థితి వస్తుంది. దేశంలోని అనేక రాష్ర్టాల్లో ఉన్నత విద్య ఫీజుల ఖరారుకు ఫీజు నియంత్రణ కమిటీలే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వమే దానిని కమిషన్‌గా మార్చి గందరగోళ పరిస్థితులు తెచ్చింది.


    ఎగ్జిక్యూటివ్‌ అధికారాలు బదిలీ

    ఉన్నత విద్యాశాఖ ప్రక్షాళన ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కళాశాల విద్యా శాఖను ఉన్నత విద్య కమిషనరేట్‌గా మార్చింది. సాంకేతిక విద్యా శాఖను రద్దుచేసి ఆ సిబ్బంది, ఆస్తులను ఉన్నత విద్య కమిషనరేట్‌కు బదిలీ చేసింది. ఉన్నత విద్యలో కేంద్రంగా వ్యవహరించిన ఉన్నత విద్యా మండలి అధికారాలను కమిషనరేట్‌కు బదిలీ చేసింది. మండలి చట్టం పరిధిలో లేని ఎగ్జిక్యూటివ్‌, పరిపాలన అధికారాలను కమిషనరేట్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇకపై ప్లానింగ్‌, విద్యలో నాణ్యత, కరిక్యులమ్‌ సంస్కరణలు, పరిశోధనలకే మండలి పరిమితం కానుంది. దీంతో ఇకపై ఉన్నతలో కీలక అధికారాలన్నీ కమిషనరేట్‌కు బదిలీ అవుతాయి. అన్ని కోర్సుల అడ్మిషన్లను కమిషనరేటే చేపడుతుంది. ప్రస్తుతం ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, బీఈడీ కాలేజీలు, పీజీ కాలేజీల అనుమతుల అధికారాలు మండలికి ఉన్నాయి. మరోవైపు నైపుణ్యాభివృద్ధి శాఖలోనూ కొత్తగా కమిషనరేట్‌ ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటుచేసిన ఉన్నత విద్య కమిషనరేట్‌లోకి పాలిటెక్నిక్‌ కాలేజీలు వచ్చాయి. ఇప్పటివరకూ ఈ కాలేజీలు సాంకేతిక విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement