నేడు, రేపు అవసరమైతే తప్ప బయటికి రావొద్దు: అనిత
అమరావతి : మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో అత్యవసరమైతే తప్ప.. బయటకు రావొద్దని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి వంగలపూడి అనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, విపత్తుల విభాగం ఎండీ ప్రఖర్‌జైన్ ఇతర అధికారులతో ఆమె సమీక్షించారు. ‘సాంకేతికతతో తుఫాన్ నష్ట నివారణకు చర్యలు చేపట్టాం. ఇళ్లు ప్రమాదకరంగా ఉంటే సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి. స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 18004250101 సేవ్ చేసి పెట్టుకోవాలి. ఏ సహాయం అవసరమైనా కంట్రోల్ రూమ్‌కు సమాచారమివ్వాలి. అధికారుల సూచనలు పాటిస్తూ, సహకరించాలి. సీఎం ఆదేశాల ప్రకారం మంత్రులు, సెక్రటరీలు, ఐఏఎ్‌సలు, కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం తుఫాన్‌పై ఫోకస్ పెట్టాలి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటే వినియోగించేందుకు జిల్లాలకు శాటిలైట్ అందుబాటులో ఉంచాలి. తుఫాన్ ప్రభావం చూపే జిల్లాలకు ఇప్పటికే 6 ఎన్డీఆర్‌ఎఫ్, 13 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు పంపాం. అన్ని చోట్లా హెలీపాడ్లను సిద్ధం చేశాం. నేవీ అధికారులను అప్రమత్తం చేశాం. అవసరమైతే పునరావాస కేంద్రాలతో పాటు స్కూల్స్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు వినియోగించుకోవాలి. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే.. కఠిన చర్యలు తప్పవు’ అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.










Comments