ప్రభుత్వ సలహాదారుగా పి.సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్ : క్యాబినెట్‌లో చోటు ఆశించిన ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం క్యాబినెట్ హోదాతో కీలక పదవులు ఇచ్చింది. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారు (అభివృద్ధి, సంక్షేమ ఫ్లాగ్‌షిప్ పథకాల అమలు)గా నియమించింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే కె.ప్రేమ్‌సాగర్‌రావును రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమించింది. ఇద్దరికీ క్యాబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు.. సుదర్శన్‌రెడ్డి క్యాబినెట్ హోదాలో అన్ని క్యాబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతారని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ఇతర అధికారులతో సమీక్షించే అధికారాన్ని ఆయనకు దఖలు పరిచింది. మంత్రుల స్థాయిలో ఆయనకు నివాస భవనం, సచివాలయంలో మంత్రుల మాదిరిగా చాంబర్‌ను కూడా కేటాయించనున్నట్లు పేర్కొంది. జీత భత్యాలు, సిబ్బంది వంటి సౌకర్యాలు కూడా మంత్రుల స్థాయిలో ఉంటాయని తెలిపింది. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శి స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని, సలహాదారు సుదర్శన్‌రెడ్డికి సచివాలయం నుంచి అవసరమైన సహకారం అందిస్తారని వివరించింది. సలహాదారు, కార్యదర్శి యూనిట్ మొత్తం.. పథకాల అమలుపై ఎప్పటికప్పుడు క్యాబినెట్‌కు వివరించాల్సి ఉంటుందని పేర్కొంది.
మంత్రి పదవి కోసం ప్రయత్నించినా.. నిజానికి సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు ఇద్దరూ మంత్రివర్గంలో స్థానం కోసం ఎంతో ప్రయత్నించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యంలో భాగంగా తనకు మంత్రి పదవి వస్తుందని సుదర్శన్‌రెడ్డి మొదటి నుంచీ భావిస్తూ వచ్చారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావు కూడా బెర్తు ఆశించారు. కానీ, ఎప్పటికప్పుడు వీరికి అవకాశం చేజారుతూ వచ్చింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ విస్తరణలో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటికీ.. సుదర్శన్‌రెడ్డికి చివరి దశలో అవకాశం చేజారింది. వాస్తవానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో సుదర్శన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కావడం, ఇదివరకు మంత్రిగా చేసిన అనుభవం ఉండడం, సీఎం రేవంత్‌రెడ్డితో మొదటి నుంచి సఖ్యతగా ఉంటున్నందున.. మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ, మంత్రివర్గ విస్తరణలో సామాజిక వర్గాల సమీకరణ అంశం బలంగా ఉండడం, అప్పటికే క్యాబినెట్‌లో రెడ్డి సామాజికవర్గం మంత్రులు ఉండడంతో సుదర్శన్‌రెడ్డికి అవకాశం దక్కలేదు. జి.వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరిలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామితోపాటు ప్రేమ్‌సాగర్‌రావు కూడా మంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. కానీ, సామాజిక కోణం, అధిష్ఠానం అండదండల నేపథ్యంలో వివేక్‌కే స్థానం దక్కింది. అయినా.. క్యాబినెట్‌లో మరో మూడు బెర్తులు ఖాళీగా ఉండగా.. తాజాగా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంసంఖ్య 16కు చేరింది. ఇంకా రెండు బెర్తులు మిగలడంతో.. మరోసారి విస్తరణలో సుదర్శన్‌రెడ్డికి అవకాశం దక్కవచ్చన్న చర్చ జరిగింది. కానీ, ప్రభుత్వం ఆయనను క్యాబినెట్ హోదాలో సలహాదారుగా నియమించడంతో ఇక నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రేమ్‌సాగర్‌రావుకూ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో మిగతా రెండు బెర్తులను భర్తీ చేస్తారా? లేక ఇతరుల కోసం రిజర్వ్ చేసి పెట్టారా? అన్న చర్చ జరుగుతోంది.










Comments