షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా
మహిళల క్రికెట్ ఒకప్పటిలా లేదు. వన్డే క్రికెట్‌లో 300 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించగల సత్తా ప్లేయర్లలో ఉంది. అది రెండో సెమీస్‌లో ఆసీస్‌పై టీమిండియా ప్రదర్శనే ఉదాహరణ. ఫైనల్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 299 పరుగులు లక్ష్యాన్ని సౌతాఫ్రికాకు నిర్దేశించింది. అప్పటికే ఫామ్‌లో ఉన్న సఫారీ సేనకు ఇది పెద్ద కష్టమేమీ కాదనే భావించారంతా. కానీ.. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న ఓ నిర్ణయమే తమ కొంప ముంచిందని సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ వెల్లడించింది.
‘మేము టీమిండియా బౌలింగ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాం. షెఫాలీ బౌలింగ్ ఇలా ఉంటుందని మేం అస్సలు ఊహించలేదు. మాకు అదే సర్‌ప్రైజింగ్ అనిపించింది. చాలా నెమ్మదిగా బంతులు సంధిస్తూ ఏకంగా రెండు వికెట్లు తీసుకుంది. వరల్డ్ కప్ ఫైనల్ లాంటి మ్యాచుల్లో పార్ట్ టైం బౌలర్లకు వికెట్లు ఇవ్వడం సరికాదు. కీలక వికెట్లను తీయడంతో మేం తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాం. ఆమెకు మరిన్ని వికెట్లు ఇవ్వకూడదనే ఉద్దేశంతో చాలా పొరపాట్లు చేశాం. షెఫాలీ చాలా అద్భుతంగా బౌలింగ్ చేసింది. మేం ఆమె బౌలింగ్ కోసం అస్సలు సన్నద్ధం కాలేదు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం మమ్మల్ని షాక్‌తో పాటు ఆశ్చర్యానికి గురి చేసింది’ అని లారా వెల్లడించింది.
 
క్రెడిట్ అంతా షెఫాలీకే: హర్మన్ ప్రీత్ కౌర్
‘లారా, సూనె క్రీజులో ఉన్నప్పుడు మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపే ఉన్నట్లు అనిపించింది. అప్పుడు షెఫాలీని చూశా. అప్పుటికే బ్యాటింగ్‌లో అదరగొట్టింది. తప్పకుండా ఫైనల్ మ్యాచ్ మనమే గెలవాలనే పట్టుదలతో ఉన్నా. షెఫాలీకి కనీసం ఒక్క ఓవర్ అయినా ఇవ్వాలని నా మనసు చెబుతూనే ఉంది. అదే మాకు టర్నింగ్ పాయింట్ అయింది. కనీసం రెండు లేదా మూడు ఓవర్లు ఇస్తానని ముందే చెప్పా. షెఫాలీ మాత్రం అవకాశం ఇస్తే పది ఓవర్లు వేస్తానని చెప్పింది. చాలా సానుకూలంగా స్పందించిన ఆమెకే ఈ క్రెడిట్ దక్కుతుంది. జట్టు కోసం ముందుకొచ్చిన షెఫాలీకి సెల్యూట్’ అని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది.
 
                     
                              
  









 
 
Comments