• Oct 10, 2025
  • NPN Log

    విశాఖపట్నం: ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నాడిన్‌ డి క్లెర్క్‌ (54 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 84 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో వరల్డ్‌క్‌పలో దక్షిణాఫ్రికా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా మూడు వికెట్ల తేడాతో భారత్‌కు షాకిచ్చింది. తొలుత భారత్‌ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్‌ (77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 94), ప్రతీక రావల్‌ (37), స్నేహ్‌ రాణా (33) పోరాటాలు వృథా అయ్యాయి. ట్రయన్‌ 3 వికెట్లు.. కాప్‌, డి క్లెర్క్‌, ఎంలబా తలో రెండు వికెట్లు సాధించారు. ఛేదనలో సౌతాఫ్రికా 48.5 ఓవర్లలో 252/7 స్కోరు చేసి గెలిచింది. కెప్టెన్‌ లారా వొల్వార్డ్‌ (70), ట్రయన్‌ (49) రాణించారు. డి క్లెర్క్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

    నిలబడిన లారా..: బ్రిట్స్‌ (0)ను మూడో ఓవర్‌లోనే క్రాంతి రిటర్న్‌ క్యాచ్‌తో డకౌట్‌ చేయడంతో.. ఆరంభంలోనే సౌతాఫ్రికా ఆట గతితప్పింది. లూస్‌ (5)ను అమన్‌జోత్‌ స్వల్ప స్కోరుకే వెనక్కిపంపింది. కాప్‌(20)ను రాణా బౌల్డ్‌ చేయగా.. బోష్‌ (1)ను దీప్తి రిటర్న్‌ క్యాచ్‌తో వెనక్కిపంపింది. జెఫ్టా (14)ను శ్రీచరణి వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో సఫారీలు 81/5తో ఇబ్బందుల్లో పడ్డారు. అయితే, ట్రయన్‌తో కలసి లారా ఆదుకొనే ప్రయత్నం చేసింది. కీలక సమయంలో క్యాచ్‌లు చేజార్చిన భారత ఫీల్డర్లు ప్రత్యర్థికి పుంజుకొనే అవకాశం కల్పించారు. చివరి 4 ఓవర్లలో సౌతాఫ్రికా విజయానికి 41 రన్స్‌ కావాల్సి ఉండగా.. క్రాంతి వేసిన 47వ ఓవర్‌లో డి క్లెర్క్‌ 6,6,4తో 18 రన్స్‌ రాబట్టింది. దీంతో సమీకరణం 18 బంతుల్లో 23 రన్స్‌కు దిగివచ్చింది. ఈ దశలో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదిన డి క్లెర్క్‌.. మరో ఏడు బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ఫినిష్‌ చేసింది.

     

    మంధాన విఫలం..: మరోసారి టాపార్డర్‌ వైఫల్యంతో కష్టాల్లో పడిన భారత్‌.. రిచా ఎదురుదాడితో పోరాడగలిగే స్కోరు చేసింది. ఒక దశలో భారత్‌ 153/7తో కష్టాల్లో పడగా.. రిచా, రాణా ఎనిమిదో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యంతో జట్టు స్కోరును 250 దాటించారు. స్మృతి మంధాన (23) మళ్లీ విఫలమైంది. హర్లీన్‌ డియోల్‌ (13), ప్రతీక, జెమీమా (0), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (9), దీప్తి శర్మ (4) పెవిలియన్‌కు క్యూ కట్టడంతో.. భారత్‌ 47 పరుగుల తేడాతో ఐదు వికెట్లు చేజార్చుకొంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిచా ఎటాకింగ్‌ ఆటతో మ్యాచ్‌ గతిని మార్చింది. అయితే, ఆఖరి ఓవర్‌లో డి క్లెర్క్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే క్రమంలో క్యాచవుటైన రిచా త్రుటిలో శతకం చేజార్చుకొంది.

    ఈ మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన మంధాన.. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక రన్స్‌ (982) సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో 1997లో ఆస్ట్రేలియా క్రికెటర్‌ బెలిండా క్లార్క్‌ 970 పరుగుల రికార్డును స్మృతి అధిగమించింది.

    8వ నెంబరులో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా రిచా (94) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది శ్రీలంకతో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ప్లేయర్‌ ట్రయన్‌ 74 పరుగుల రికార్డును ఘోష్‌ బద్దలుకొట్టింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement