• Jun 13, 2026
  • NPN Log

    విజయవాడ: సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ నేతలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో వన్‌టౌన్ చైనా వాల్ నుంచి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం దుర్గగుడి ఘాట్ రోడ్డులోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి సారె సమర్పించి రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.

    విజయవంతంగా రెండేళ్లు

    ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేలా శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

    గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, అందుకే ఆ పార్టీని ఘోరంగా ఓడించారని బుద్దా వెంకన్న విమర్శించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారని గుర్తుచేశారు.

    తప్పుడు ప్రచారం

    అమరావతి, విజయవాడ ప్రాంతాలు వరదలు వస్తే పూర్తిగా మునిగిపోతాయని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తులను ఎవ్వరూ అడ్డుకోలేరని, వరదలను కూడా రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. ఇటీవల భారీ వర్షాలకు హైదరాబాద్‌లో కూడా నీటిమునిగిన పరిస్థితులు కనిపించాయని పేర్కొన్నారు.

    76 ఏళ్ల వయసులోనూ..

    చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయసులోనూ రోజుకు 20 గంటల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని కొనియాడారు. భారత రాజకీయాల్లో చంద్రబాబు ఒక సూపర్ స్టార్ అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన వైసీపీ నేతలు అసెంబ్లీకి వెళ్లకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని అమ్మవారిని కోరుకున్నామని బుద్దా వెంకన్న తెలిపారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement