మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ : కాంగ్రెస్ నేత అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో అజారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అల్లా సాక్షిగా ప్రమాణం చేసిన ఆయన జై తెలంగాణ, జైహింద్ అంటూ నినదించారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు, ఇతర నేతలు అజారుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్‌లో పార్టీ గెలుపే తక్షణ కర్తవ్యం
మంత్రిగా తనకు అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందని, తనను మంత్రిగా చూసినందుకు తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషపడ్డారని అజారుద్దీన్ చెప్పారు. తన తక్షణ కర్తవ్యం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడమేనన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై అజారుద్దీన్ స్పందించారు. తన గురించి కిషన్‌రెడ్డికి పూర్తిస్థాయిలో అవగాహన లేదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు సరైనవి కావని, ఒక్క కేసులోనూ నేరం రుజువు కాలేదని చెప్పారు.
అజారుద్దీన్‌పై ఏం కేసులున్నాయో చెప్పండి
భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా అజారుద్దీన్ దేశానికి ఎన్నో విజయాలను అందించిన సంగతి మరిచారా అని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్.. కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి నిర్ణయం 3నెలల కిందటే తీసుకున్నామన్నారు. ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా ప్రేమ్‌సాగర్‌రావులను ప్రభుత్వం నియమించడాన్ని మహే్‌షకుమార్‌గౌడ్ స్వాగతించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్లో ఆమె చిత్రపటానికి మహే్‌షకుమార్‌గౌడ్ నివాళి అర్పించారు.
ఎంఐఎంతో మ్యాచ్ ఫిక్సింగ్: బీజేపీ
ఎంఐఎంతో మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. క్రికెట్‌లోనే కాదు, రాజకీయాల్లో కూడా అజర్ మ్యాచ్ ఫిక్సరే అని ఆయన ఆరోపించారు. జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే, ఒక వర్గం ఓట్ల కోసం మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఒవైసీ చెబితేనే కాంగ్రెస్.. నవీన్‌యాదవ్‌కు టికెట్టు, అజర్‌కు మంత్రి పదవి ఇచ్చిందని ఆయన అన్నారు.










Comments