మ్యుటేషన్ కోసం రూ.5లక్షల లంచం
చిట్యాల : భూమి మ్యుటేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసి.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారో తహసీల్దార్. ఈ మేరకు నల్లగొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ గగులోతు కృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ మహబూబ్‌నగర్ జిల్లా డీఎస్పీ, నల్లగొండ ఇన్‌చార్జి సీహెచ్ బాలకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని మెస్సర్స్ రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసిన భూమిని మ్యుటేషన్ చేసేందుకు తహసీల్దార్ గగులోతు కృష్ణ.. ఆ సంస్థ బాధ్యుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. అయితే రూ.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అనంతరం ఆ తహసీల్దార్‌పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్‌కు చెందిన వ్యక్తి రూ.2లక్షల నగదును తహసీల్దార్ సూచించిన గట్టు రమేశ్‌కు ఇస్తుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్‌తో పాటు గట్టు రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. తహసీల్దార్ కృష్ణ, రమేశ్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. తహసీల్దార్, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Comments