రజనీకాంత్‌కు గుడి కట్టిన అభిమాని
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ కనిపిస్తుంది. 75 ఏళ్ల వయసులో కూడా బిగ్ స్క్రీన్‌పై మాస్ హీరోగా సంచలనాలు సృష్టిస్తున్న ఆయనకు అభిమాని కానీ వారు ఎవరు ఉండరు. ఆయన స్టైల్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే కొందరిలో ఆ అభిమానం మరీ తీవ్ర స్థాయికి చేరుతోంది. తాజాగా తలైవా వీరాభిమాని చేసిన ఓ పని సోషల్ మీడియాలో బిగ్ డిబేట్ గా మారింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. అయితే తమిళనాడులోని మధురై తిరుమంగళం ప్రాంతంలోని రజనీకాంత్ అభిమాని మాజీ సైనికుడైన కార్తీక్ ఇంట్లో రజనీకాంత్ విగ్రహానికి పూజలు జరుగుతున్నాయి. పూజలు సాధారణమే కానీ మరో ఆసక్తికర సంఘటన కూడా జరిగింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రజనీకాంత్ ను దైవంగా భావించి ఆయన ప్రతిమలతో బొమ్మల కొలువును ఏర్పాటు చేశాడు. కొలువులో ఏకంగా 230 రజనీకాంత్ ప్రతిమలను పొందుపరిచాడు. ఆయన సినిమాల్లోని ఐకానిక్ లుక్స్ తో పాటు శివుడిగా, కృష్ణుడిగా రజనీకాంత్ కనిపించే బొమ్మలను 15 వరుసల్లో అమర్చాడు. ఆలయాన్ని ఫ్లవర్స్, లైటింగ్‌లతో సర్వాంగ సుందరంగా అలంకరించి, మధ్యలో ప్రధాన విగ్రహాన్ని తీర్చిదిద్దాడు. గ్రానైట్ రాయితో 3.5 అడుగుల ఎత్తు, 300 కిలోల బరువుతో ఈ విగ్రహాన్ని తయారు చేయించాడు. అయితే కార్తీక్ అభిమానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రజనీకాంత్‌పై కార్తీక్ చూపిస్తున్న అభిమానాన్ని కొందరు మెచ్చుకుంటుండగా మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. హీరోలపై అభిమానం ఉండటంలో తప్పులేదు కానీ అతి చేయకూడదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరీ గుడి కట్టి పూజించేంత వీరాభిమానం కరెక్ట్ కాదని అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్ల రెండు వర్గాలుగా విడిపోయి వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఇదేమైనా కార్తీక్ చేసిన పని ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.
Comments