రేపే జీశాట్-7ఆర్ ప్రయోగం
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. అత్యంత బరువైన పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లే ఇస్రో బాహుబలిగా పేరుగాంచిన ఎల్వీఎం3-ఎం5 (మార్క్3) రాకెట్ ద్వారా జీశాట్-7ఆర్ (సీఎంఎస్-03) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. భారత సైనిక అవసరాల కోసం ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహన్ని ఇస్రో అభివృద్ధి చేసింది. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ శుక్రవారం షార్‌కు చేరుకుని శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగ ఏర్పాట్లలో పాలుపంచుకున్నారు. ఎల్వీఎం3-ఎం5 రాకెట్ ఆదివారం సాయంత్రం 5:26 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి ఎగరనుంది. దీనికోసం 24 గంటలు ముందు.. శనివారం సాయంత్రం 5:26 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) షార్‌లోని బ్రహ్మప్రకా్‌షలో హాలులో జరిగింది. అనంతరం రాకెట్ ప్రయోగ పనులను లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు అప్పగించారు. షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ అధ్యక్షతన ల్యాబ్ వారు సమావేశమై చర్చించి.. ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇస్రో 4,400 కిలోల బరువైన సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. రాకెట్ నింగిలోకి ఎగిరాక తన మూడు దశలను పూర్తి చేసుకుని శిఖర భాగాన ఉన్న సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని 16.09 నిమిషాలకు కక్ష్యలోకి చేర్చేలా డిజైన్ చేశారు. శుక్రవారం ప్రీ కౌంట్‌డౌన్ నిర్వహించి రిహార్సల్‌ను పూర్తి చేశారు.










Comments