లుఫ్తాన్సా విమానంలో ఘర్షణ
న్యూఢిల్లీ : షికాగో నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ వెళుతోన్న లుఫ్తాన్సా విమానంలో ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి(28) అనే తెలుగు యువకుడు శనివారం ఇద్దరు టీనేజర్లను ఫోర్క్‌తో పొడిచి గాయపరిచాడు. అంతేగాక విమానం సిబ్బందిపైనా దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా బోస్టన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. మారణాయుధంతో ఇతరులకు హాని చేసేందుకు ప్రయత్నించినట్లు అతడిపై మసాచుసెట్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అభియోగాలు మోపింది. విమానంలో ఇద్దరు 17 ఏళ్ల బాలురపై మెటల్ ఫోర్క్‌తో దాడి చేసిన ప్రణీత్ కుమార్ వారిలో ఒకరి భుజంపై, మరొకరి తల వెనుక పొడిచాడు. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన విమానం సిబ్బందికి తన చేతివేళ్లను తుపాకీలా చూపుతూ ట్రిగ్గర్ నొక్కినట్లు చేసి బెదిరించాడని అధికారులు చెప్పారు. అంతేగాక మరో మహిళా ప్రయాణికురాలిని కూడా చెంపపై కొట్టి విమానం సిబ్బంది ఒకరిని కూడా కొట్టేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు. ప్రణీత్ గతంలో విద్యార్థి వీసాపై అమెరికాలో మాస్టర్స్ చదివాడని, ప్రస్తుతం ఎటువంటి వీసా లేకుండానే ఉంటున్నాడని తెలిపారు. అతడి నేరాలు నిర్ధారణ అయితే దాదాపు 10 ఏళ్ల జైలుశిక్ష, 2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.









Comments