సైనిక చర్య లేకుండానే పీవోకే స్వాధీనం
న్యూఢిల్లీ : ఎటువంటి సైనిక చర్యలు లేకుండానే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను భారత్ స్వాధీనం చేసుకుంటుందని, పీవోకే ప్రజలు ‘మేము భారత్‌లో భాగమే’ అని చెప్పుకొనే రోజు ఎంతో దూరంలో లేదని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. సోమవారం మొరాకోలో పర్యటించిన ఆయన ఆ దేశ రక్షణ మంత్రి అబ్డెల్టిప్ లౌడియితో సమావేశం అయ్యారు. సైనిక సహకారానికి సంబంధించిన ఎంవోయూపై ఇరుదేశాల మంత్రులు సంతకాలు చేశారు. అనంతరం అక్కడి ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడారు. ‘‘పీవోకే ప్రజలు ప్రస్తుత పాలనతో సంతోషంగా లేరు. వారు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. పీవోకే దానంతట అదే భారత్‌లో భాగమవుతుంది. మనం పీవోకే మీద దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పీవోకేను తిరిగిపొందే అవకాశాన్ని కేంద్రప్రభుత్వం చేజార్చుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో రక్షణమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Comments