హైకోర్టు జడ్జీల పనితీరుపై మదింపు అవసరం
న్యూఢిల్లీ : కొందరు హైకోర్టు న్యాయమూర్తుల పనితీరుపై సోమవారం సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘కార్యభారం నిర్వహించలేక లక్ష్యాలను చేరుకోలేకపోతున్నార’ని వ్యాఖ్యానించింది. అందువల్ల వారి ‘పనితీరును మదింపు వేయాల్సిన అవసరం ఉంద’ని అభిప్రాయపడింది. డెస్కులపై ఫైళ్లు పేరుకుపోకుండా చూసుకోవాలని హితవు చెప్పింది. ఓ క్రిమినల్ కేసులో తాము చేసిన అప్పీళ్లపై తుది వాదనలు విన్న ఝార్ఖండ్ హైకోర్టు ఏళ్ల తరబడి తీర్పును విలువరించడం లేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. కొందరు జడ్జీలు రాత్రింబవళ్లు కష్టపడి పెద్ద సంఖ్యలో కేసులను పరిష్కరిస్తున్నారని తెలిపింది. మరికొందరు లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని అభిప్రాయపడింది. రోజుకు ఒక్క క్రిమినల్ కేసునే విచారిస్తానని ఎవరైనా జడ్జి అంటే అర్థం చేసుకోవచ్చని, అదే బెయిల్ మంజూరు కేసులను కూడా రోజుకు ఒక్క దాన్నే విచారిస్తానంటే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. అందువల్లనే ‘పనితీరు మదింపు’ ఉండాలని అభిప్రాయపడింది. అయితే ఏ ప్రాతిపదికన పనితీరును మదింపు చేయాలి, ఇందుకు మార్గదర్శకాలు ఏమిటన్నది పెద్ద సమస్య అని అభిప్రాయపడింది.
Comments