2030 నాటికి రూ.35.32 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ) సేవల మార్కెట్ 2030 నాటికి 400 బిలియన్ డాలర్లకు (40,000 కోట్ల డాలర్లు= రూ.35.32 లక్షల కోట్లు) చేరుకోవచ్చని బెస్సెమెర్ వెంచర్ పార్ట్‌నర్స్ నివేదిక అంచనా వేసింది. వ్యాపారాల వృద్ధికి ఏఐ సేవల వినియోగం విరివిగా పెరుగుతుండటంతో పాటు అంతర్జాతీయంగా ఐటీ సేవల ఔట్‌సోర్సింగ్ భారీగా పెరగనుండటం ఇందుకు దోహదపడనుందని నివేదిక పేర్కొంది. భారత ఐటీ పరిశ్రమ 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఏటేటా 8.1 శాతం చొప్పున వృద్ధి చెందుతూ 26,400 కోట్ల డాలర్లకు చేరుకుందని బెస్సెమెర్ నివేదికలో ప్రస్తావించింది. 2025-30 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఏటేటా 8.7 శాతం చొప్పున వృద్ధి చెంది 40,000 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఐటీ రంగం నిర్మాణాత్మక మార్పులకు లోనవుతున్న తరుణంలో ఈ నివేదిక అత్యంత ఆశావహ అంచనాలను విడుదల చేయడం గమనార్హం. ఏఐ, డిజిటల్ టెక్నాలజీలతో ఐటీ రంగంలో క్లయింట్ల ప్రాధాన్యాలు, వ్యయాల తీరులో గణనీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏఐతో ఐటీ కంపెనీలు క్లయింట్ల నుంచి వసూలు చేసే చార్జీలపై ఒత్తిడి పెంచనున్నప్పటకీ, మరిన్ని కొత్త మార్కెట్లు అందుబాటులోకి రానుండటం వాటి ఆదాయ పెరుగుదలకు దోహదపడనుందని బెస్సెమెర్ వెంచర్ పార్ట్‌నర్స్ సీఓఓ నితిన్ కైమల్ అన్నారు.










Comments