అడవిలో ఫొటోగ్రాఫర్‌గా మారి..
ప్రతి ఒక్కరి రహస్య నైపుణ్యాలు దాగి ఉంటాయి. వాటిని కనిపెట్టి మెరుగులు దిద్ది, ప్రతిభను చాటుకునే సామర్థ్యం కొందరికే ఉంటుంది. కేరళకు చెందిన బీట్ ఆఫీసర్, బిస్మి విల్స్ కథే ఇందుకు ఉదాహరణ. అటవీ శాఖలో వృత్తి బాధ్యతలకే పరిమితమైపోకుండా, తనలోని కెమెరా నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుని, కేరళ అటవీ శాఖ ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాలకు నిదర్శనంగా మారిందామె. మరిన్ని వివరాలు...
తిరువనంతపురంలోని పరసాలకు చెందిన బిస్మి విల్స్.. కేరళ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా ఎంపికైంది. పరీక్ష పాసై, ఉద్యోగానికి ఎంపికైంది కాబట్టి వృత్తిలో చేరాలనే ఆలోచనే తప్ప, వృత్తి పట్ల ఆమెకెలాంటి ఆసక్తి కలగలేదు. అయితే ఆమె పై అధికారి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రియ టి.జోసెఫ్ మాటలు బిస్మిని ప్రభావితం చేశాయి. వృత్తిలో పైకి ఎదగాలంటే, వృత్తి పట్ల నిబద్ధత కలిగి ఉండాలనీ, మక్కువ పెంచుకోవాలనీ ప్రియ... బిస్మికి హితబోధ చేసింది. ఆ మాటలు బిస్మి మనసులో నాటుకుపోయాయి. అప్పటి నుంచి అడవిలో గస్తీ సమయంలో పరిసరాలను ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టింది.
చుట్టూరా అందమైన ప్రకృతి, ఆసక్తి కలిగించే వన్యప్రాణులు, వాటి ప్రవర్తనలు ఆమెను ఆకట్టుకోవడం మొదలుపెట్టాయి. వాటిని జ్ఞాపకాల్లో బంధించడంతో పాటు, అటవీ శాఖకు ఉపయోగపడేలా కెమెరాలో బంధిస్తే ప్రయోజనకరంగా ఉంటుందనే ఆలోచనతో ఒక డిఎ్‌సఎల్‌ఆర్ కెమెరా కొనుగోలు చేసింది బిస్మి. ఈ సందర్భం గురించి ప్రస్తావిస్తూ....‘పంప ప్రాంతంలో విధులు నిర్వహించే సమయంలో అక్కడి చెట్ల ఆకులు నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఫీల్డ్ డ్యూటీలో భాగం వేర్వేరు చెట్లను గుర్తు పెట్టుకోవడం కోసం వాటి ఆకులను సేకరించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నా ఆసక్తి సీతాకోకచిలుకల మీదకు మళ్లింది. వేర్వేరు జాతుల డేటాను సేకరించడం కోసం ఒక యాప్‌ను కూడా ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకున్నాను. అయితే చిన్న జాతుల మధ్య తేడాలను గుర్తించాలంటే వాటిని ఫొటోలు తీసుకోక తప్పదు. దాంతో నాది పాత ఫోన్ అవడంతో, ఒక డిజిటల్ కెమెరా కొనుక్కున్నాను’’ అంటూ తన కెమెరా ప్రయాణం తొలినాళ్ల గురించి వివరించింది బిస్మి.
నేర్పు, ఓర్పు అవసరం
పంప నుంచి వలక్కడువుకు బదిలీ అవడంతో బిస్మిలోని వన్యప్రాణుల ప్రేమికురాలు మేలుకొంది. ‘‘పంపకు భిన్నంగా వలక్కడువులో ఏనుగులు, సాంబార్ డీర్.. ఇతర జంతువులు కనిపిస్తూ ఉండేవి. ఫారెస్ట్ వాచర్, అనుభవమున్న వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ విష్ణు నాకు తోడయ్యాడు. దాంతో ఇద్దరం కలిసి వన్యప్రాణులను వెతుక్కుంటూ కొండల మీద తిరగడం మొదలుపెట్టాం. ఏనుగుల వాసనను పసిగట్టి, వాటికి 250 మీటర్ల దూరానికి చేరుకుని, అందమైన ఫొటోలు తీయడం మొదలుపెట్టాం. జంతువుల దృష్టిలో పడకుండా ఎలా నడుచుకోవాలో, వాటికి భంగం కలగకుండా ఫొటోలు ఎలా తీయాలో, గాలి వీచే దిశ ఆధారంగా, నా ఉనికిని జంతువులు పసిగట్టే వీలు లేకుండా ఫొటోలకు తగిన ప్రదేశాన్ని ఎలా ఎంచుకోవాలో అతను నాకు నేర్పించాడు.
ఆ మెలకువల మీద పట్టు పెరిగిన తర్వాత, ఎన్నో మరపురాని ఫొటోలను తీయగలిగాను. ఎలుగుబంటి మీద దాడి చేసే అడవి కుక్కను ఫొటోలో బంధించగలిగాను. మేత మేస్తూ, గొడవ పడుతూ, ప్రేమ ప్రదర్శించుకునే పాతిక ఏనుగుల మందను ఫొటోలు తీయగలిగాను. అయితే ఫొటోల కోసం నేను చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుందనే నమ్మకం ఉండదు. గంపెడు ఆశతో వెళ్లి, నిరుత్సాహంతో వెనుతిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. గంటల తరబడి ఎదురుచూసి, ఖాళీ చేతులతో తిరిగొచ్చిన రోజులూ లేకపోలేదు. వన్యప్రాణుల ఫొటోగ్రఫీకి ఎంతో నేర్పు, ఓర్పు అవసరం’’ అంటూ ఫొటోలు తీయడంలో ఎదుర్కొన్న శ్రమల గురించి వివరిస్తోంది బిస్మి.
పులిని ఫొటో తీయాలి
‘‘నా అంతిమ లక్ష్యం పులిని ఫొటోలు తీయడం. చాలాసార్లు వాటిని అనుసరించినా, కెమెరాలో బంఽధించే అవకాశం ఇప్పటివరకూ రాలేదు. పులులు సిగ్గరులు. అవి మనుషులకు దూరంగా ఉంటాయి. అయినా ఏదో ఒకనాటికి పులిని కచ్చితంగా కెమెరాలో బంధిస్తాను’ అంటున్న బిస్మి, ప్రకృతి, వన్యప్రాణుల పట్ల ప్రేమతో అటవీ శాఖలో చేరుతున్న మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతోందనీ, అయితే ఈ వృత్తిలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ అడవులు, వన్యప్రాణుల పట్ల మక్కువను పెంచుకోవడం అవసరమని అంటోంది. ఆమె తీసిన ఫొటోలు కేరళ అటవీ శాఖ డాటా సేకరణకు ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. బిస్మి ఫొటోల వల్ల, అడవిలో వన్యప్రాణుల జీవనశైలి, వాటి మధ్య వైవిధ్యాలను ఆధారాలతో సహా ప్రదర్శించగలిగే అవకాశం కూడా దక్కుతూ ఉండడం చెప్పుకోదగిన విశేషం వినూత్నం.
Comments