• Jun 05, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : డిజిటల్‌ విప్లవం వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో మొబైల్‌ నెట్‌వర్క్‌లు దేశాల ఆర్థిక వ్యవస్థలకు జీవనాడిగా మారుతున్నాయి. ఒకప్పుడు కాల్స్‌, సందేశాలకే పరిమితమైన మొబైల్‌ రంగం ఇప్పుడు సమగ్ర అభివృద్ధికి ఆధారస్తంభంగా నిలుస్తోంది. కృత్రిమ మేధ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఐవోటీ వంటి ఆధునిక సాంకేతికతల విస్తరణతో మొబైల్‌ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో బలమైన, స్థిరమైన కనెక్టివిటీ అవసరం ఏర్పడింది. భవిష్యత్తు డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు నెట్‌వర్క్‌ బలోపేతమే పునాది అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థ జీఎస్ఎంఏ నివేదిక ‘ది మొబైల్‌ ఎకానమీ-2026’ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2జీ, 3జీ వంటి పాత నెట్‌వర్క్‌లు కనుమరుగవుతుండగా, వేగవంతమైన 5జీ సేవలు పెరుగుతున్నాయి. 2030 నాటికి 2జీ, 3జీ నెట్‌వర్క్‌లు 1 నుంచి 5 శాతానికే పరిమితమవుతాయని నివేదిక అంచనా వేసింది. ఇదే సమయంలో 5జీ విస్తరణ ప్రపంచాన్ని కొత్త దిశగా తీసుకెళ్తోంది. 2030 నాటికి మొత్తం మొబైల్‌ కనెక్షన్లలో సుమారు 57శాతం 5జీ ఆధారితంగా ఉండే అవకాశం ఉంది. 2025 నుంచి 2030 మధ్య కాలంలో ఈ రంగంలోకి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెరిగి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. అయితే, కవరేజీ పెరుగుతున్నప్పటికీ వినియోగంలో ఇంకా గ్యాప్‌ ఉంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 830 కోట్ల జనాభా ఉండగా.. 600 కోట్ల మంది ఇంటర్‌నెట్‌ను వాడుతున్నారు.

    2030 నాటికి రూ.1,085 లక్షల కోట్ల్లు..

    టెలికం, మొబైల్‌ టెక్నాలజీలు 2025లో ప్రపంచ జీడీపీకి 6.4ు వాటాతో సుమారు 7.6 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక విలువను జోడించాయి. 2030 నాటికి దీనిప్రభావం మరింతపెరిగి ప్రపంచ జీడీపీకి 8.4శాతం వాటాతో రూ.1,085 లక్షల కోట్లు (11.3 ట్రిలియన్‌ డాలర్లు) ఆర్థిక విలువను జోడించే అవకాశం ఉంది. భారత టెలికం రంగం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా మారింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ప్రకారం దేశంలో మొబైల్‌ కనెక్షన్లు 125 కోట్ల మార్కును దాటాయి. టెలికం, మొబైల్‌ రంగాలకు దేశ జీడీపీలో 12-14శాతం వాటా ఉందని ‘మనీకంట్రోల్‌’ తెలిపింది. తెలంగాణలో కూడా టెలికం, మొబైల్‌ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. టీ-ఫైబర్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఐటీ కారిడార్లు, స్టార్టప్‌ కల్చర్‌, క్లౌడ్‌ టెక్నాలజీ విస్తరణతో తెలంగాణ డిజిటల్‌ రాష్ట్రంగా గుర్తింపు పొందుతోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement