• Mar 02, 2026
  • NPN Log

    ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడితో నెలకొన్న యుద్ధ సంక్షోభంతో ఆదివారం కూడా ప్రపంచంలో అత్యంత కీలకమైన విమానయాన మార్గమైన గల్ఫ్‌ ప్రాంత గగనతలం దాదాపుగా మూసుకుపోయింది. ప్రపంచంలో అత్యంత రద్దీ కలిగిన దుబాయి విమానాశ్రయంతోపాటు అబుధాబి, దోహా, కువైత్‌, మనామా విమానాశ్రయాలు ఆదివారం కూడా మూసి ఉండడంతో భారతీయులతో సహా అనేక దేశాల అంతర్జాతీయ విమాన ప్రయాణికులు అగమ్యగోచర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సోమవారం వీటిని పునరుద్ధరిస్తామని ఎయిర్‌లైన్స్‌లు ప్రకటించాయి. దుబాయి, అబుదాబి, దోహాలోని కీలమైన హబ్‌ విమానాశ్రయాల మూసివేతతో వెయ్యికిపైగా విమానాలను ప్రధాన పశ్చిమాసియా ఎయిర్‌లైన్స్‌ రద్దు చేయాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విమానాశ్రయాల్లో ఎమిరేట్స్‌, ఖతార్‌ ఎయిర్‌వేస్‌, ఎతిహాద్‌ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సాధారణంగా వీటి ద్వారా రోజుకు దాదాపు 90వేల మంది ప్రయాణిస్తుంటారని, అనేక మంది పశ్చిమాసియాలోని గమ్యస్థానాలకు వెళ్తుంటారని ఏవియేషన్‌ ఎనలిటిక్స్‌ సంస్థ సిరియం పేర్కొంది. కాగా అనేక మంది ఒమాన్‌ రాజధాని మస్కట్‌కు రోడ్డు మార్గం గుండా చేరుకొని అక్కడి నుంచి విమానంలో భారత్‌కు చేరడానికి ప్రయత్నిస్తున్నా అర్హులైన వారికి మాత్రమే ఒమానీ వీసా లభిస్తుండడంతో అందరికి అవకాశం దక్కడం లేదు. విమానాలు అందుబాటులో లేకపోవడంతో భారత్‌-గల్ఫ్‌ దేశాలకు మాత్రమే కాకుండా అమెరికా, ఐరోపా దేశాలకు కూడా భారతీయుల రాకపోకలు తాత్కాలికంగా స్తంభించిపోయాయి. దీంతో ఖండాతరాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. హైదరాబాద్‌ నుంచి న్యూయార్క్‌కు లేదా సింగపూర్‌ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు, నైరోబీ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ప్రతి విమానంపై ప్రభావం పడింది. భారత్‌తోపాటు ఇతర చోట్ల ప్రయాణాలకు సిద్ధమైన అనేక మంది ఆందోళన చెందుతున్నారు. గల్ఫ్‌ దేశాలలోని విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన భారతీయ ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి సంబంధిత అధికారవర్గాలతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం భారతీయ ఎంబసీలు ప్రయత్నిస్తున్నాయి.


    గల్ఫ్‌దేశాలు, ఇరాన్‌, ఇరాక్‌ గగనతలం భారత్‌తో పాటు మిగిలిన ఆసియా దేశాలను అటు ఐరోపా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాల మధ్యలో కీలక వారధిగా పని చేస్తుంది. భారత్‌, ఆసియా దేశాలకు అమెరికా, ఐరోపా ఖండాల విమానాలు ఈ మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా ఇరాన్‌, ఇరాక్‌, కువైత్‌, జోర్డాన్‌, ఇజ్రాయిల్‌, బహ్రెయిన్‌, ఖతార్‌ దేశాలు తమ గగనతలాన్ని పూర్తిగా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పాక్షికంగా మూసివేయగా మిగిలిన దేశాలన్నీ కూడా విమానాల రాకపోకలలో మార్పులను ప్రకటించడంతో వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆదివారం గల్ఫ్‌లోని ఏడు విమానాశ్రయాలలో 3,400 విమానాలను రద్దు చేసినట్లు వార్తలొచ్చాయి. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేయడం ద్వారా ఇరాన్‌ పరోక్షంగా దుబాయితో గల్ఫ్‌ ఆర్థిక నాడికి కీలకమైన విమానయానరంగంపై దాడి చేసిందని భావిస్తున్నారు. గల్ఫ్‌, ఇరాన్‌, ఇరాక్‌ దేశాల మీదుగాకాకుండా ఇతర మార్గాలగుండా వెళ్తే దూరం పెరిగి అదనపు ఇంధనం అవసరం ఉంటుంది. దీనికోసం మార్గమధ్యలోని దేశాల్లో ఇంధనం నింపుకోవాలి లేదా విమానాలలో ప్రయాణికులను తగ్గించి అదనపు ట్యాంకు ఏర్పాటు చేసుకోవాలి. విమానయాన సంస్థలకు ఇది అదనపు ఆర్థిక భారం కాగా, ప్రయాణికులకు లగేజి, అధిక ప్రయాణ గంటలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. ఇక టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ లెబనాన్‌, సిరియా, ఇరాక్‌, ఇరాన్‌, జోర్డాన్‌కు సోమవారం వరకు రద్దు చేసింది. ఖతార్‌, కువైత్‌, బహ్రెయిన్‌, యూఏఈ, ఒమాన్‌కు కూడా విమానాలను నిలిపివేసింది. అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్‌, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌.. టెల్‌ అవీవ్‌కు కనీసం వారాంతం వరకు విమానాలను నిలిపివేశాయి.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement