కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ
బెంగళూరు : ఆర్‌ఎస్ఎస్ కార్యకలాపాలకు చెక్ పెట్టాలని భావించిన కర్ణాటక ప్రభుత్వం, సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేకుండా పది మందికి మించి గుమికూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలపై ధారవాడ హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించింది. దీంతో ఆర్‌ఎస్ఎస్ పథసంచలనంతోపాటు ఇతర సభలు, ఊరేగింపులకు ఏర్పడిన అడ్డంకి తొలగిపోయింది. హుబ్బళ్లికి చెందిన పునఃచైతన్య సేవా సంస్థ దాఖలు చేసిన రిట్‌పై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు మంగళవారం తీర్పు ప్రకటించింది. నిషేధం విధించడం అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను నవంబరు 17కి వాయిదా వేసింది. రాష్ట్ర మంత్రి ప్రియాంకఖర్గే రాష్ట్రంలో ఆర్‌ఎస్ఎస్ కలాపాలను నియంత్రించాలని ఈ నెల 4న ముఖ్యమంత్రికి లేఖ రాయడంతో క్యాబినెట్‌లో చర్చించారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, ప్రభుత్వ పాఠశాల మైదానాలు, పార్కులు, రోడ్లపై ప్రైవేటు సంస్థలు అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని, పదిమందికి మించి ఊరేగింపులు చేయరాదని ఈ నెల 18న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా హైకోర్టు తీర్పుతో ఆయా సంస్థలకు ఉపశమనం లభించినట్లయింది. ఇదిలా ఉండగా, ఆర్‌ఎ్‌సఎస్ సహా ఏ సంఘమైనా ప్రభుత్వ స్థలాల్లో సభలు, ఊరేగింపులు నిర్వహించేందుకు ముందస్తు అనుమతి పొందాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ధారవాడ హైకోర్టు బెంచ్ స్టే ఇవ్వడంపై సీఎం సిద్దరామయ్య స్పందించారు. దీనిపై తాము హైకోర్టు ఫుల్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు.










Comments