చేయని నేరానికి శిక్షకు గురైతే నష్ట పరిహారం
న్యూఢిల్లీ : తప్పుడు అభియోగాల కారణంగా శిక్షపడి జైలుపాలైన వ్యక్తికి నష్టపరిహారం చెల్లించే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. వ్యవస్థ ఆ వ్యక్తిని బలపశువును చేసినట్టుగానీ, తప్పుడు సాక్ష్యాలను కావాలని సృష్టించినట్టుగానీ తేలిన కేసుల్లో నష్ట పరిహార అంశాన్ని పరిగణించాలని యోచిస్తోంది. ఒకవేళ ఆ బాధితుడు నిర్దోషిగా అనంతరకాలంలో బయటకు వచ్చినప్పటికీ జైలులో అతడు కోల్పోయిన విలువైన జీవితాన్ని పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది. ఇందులోని సంక్లిష్ట అంశాలను, ప్రక్రియలోని చిక్కులను దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో తమకు సహకరించాల్సిందిగా అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌లను న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ కోరింది. దేశంలో శిక్షలు పడుతున్న కేసులు కేవలం 54 శాతమే ఉంటున్న విషయాన్ని ఈ సందర్భంగా బెంచ్ గుర్తుచేసింది. పోలీసులు పెట్టిన తప్పుడు కేసులో 12 ఏళ్లు జైలులో గడిపిన వ్యక్తి వేసిన పిటిషన్‌పై బెంచ్ విచారించే సందర్భంలో నష్టపరిహారం అంశం చర్చకు వచ్చింది. ఆ వ్యక్తి పేదవాడు. మైనర్ బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో విచారణను ఎదుర్కొంటూ ఆయన ఇటీవల వరకు జైలులో ఉన్నారు. థానే కోర్టు 2019లో మరణశిక్ష విధించడంతో కారాగారవాసం చేస్తూ సుప్రీంకోర్టులో ఆ తీర్పును ఆయన సవాల్ చేశారు. చివరకు ఆయనపై పోలీసులు నమోదు చేసినవి తప్పుడు అభియోగాలు అని తేలడంతో సుప్రీంకోర్టు తాజాగా విడుదల చేసింది. అయితే, తాను జైలులో ఇన్నాళ్లు కోల్పోయిన జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలుచేశారు.
ఆయన తరఫున సీనియర్ అడ్వకేట్ గోపాల్ సుబ్రహ్మణియం వాదనలు వినిపిస్తూ.. ఇలాంటి వ్యక్తులకు తప్పక నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. జైలు జీవితం ఆయన ప్రాథమిక హక్కులను కాలరాయడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, దీనిపై మార్గదర్శకాలను రూపొందించాలని బెంచ్‌ను కోరారు. ఈ అంశంలో ఒక స్థాయీ అమరిక అవసరమని న్యాయ కమిషన్ కూడా గతంలో సిఫారసు చేసిన అంశాన్ని ఆయన బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా, మానసిక వైద్య చట్టం-2017ను అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఇదే ధర్మాసనం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి బదిలీ చేసింది.
వైద్యులను కాపాడకుంటే సమాజం క్షమించదు
వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి అండగా నిలిచి, వారిని రక్షించుకోకపోతే సమాజం న్యాయవ్యవస్థను క్షమించదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా సమయంలో సేవలు అందించి మరణించిన ప్రయివేటు వైద్య సిబ్బందికి బీమా పరిహారం చెల్లించకపోవడాన్ని తప్పుపట్టింది. వారికి బీమా పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంగళవారం మౌఖికంగా ఆదేశించింది. వారు ప్రభుత్వ విధుల్లో లేరని, లాభాపేక్ష ఉన్న ఆస్పత్రుల్లో పనిచేస్తున్నందున బీమా పరిహారానికి అర్హులు కారంటూ చెప్పడం తగదని పేర్కొంది. పరిహారం చెల్లించడానికి ప్రధానమంత్రి బీమా పథకం కాకుండా ఇతర పథకాలు ఉంటే వారి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి పరిహారం చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని ప్రకటించింది. దీని కింద ప్రభుత్వం రూ.50 లక్షలు చెల్లిస్తుంది.










Comments