డానిష్ కోచ్‌పై నాలుగేళ్ల నిషేధం
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సంచలనం. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ కోచ్ జోయాకిమ్ పర్సన్ కు బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య నాలుగేళ్ల నిషేధం విధించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆట జరుగుతున్న సమయంలోనే బెట్టింగ్ కు పాల్పడినందుకు ఈ కఠిన చర్య తీసుకుంది.
రెండు సార్లు ఒలింపిక్ క్వార్టర్ ఫైనలిస్ట్ అయిన ఆండర్స్ ఆంటోన్సన్‌కు పర్సన్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడాది జపాన్ ఓపెన్ సందర్భంగా మ్యాచ్ జరుగుతుండగానే తన ఫోన్‌లో బెట్టింగ్ పెట్టినట్లు విచారణలో బయట పడింది. ఈ ఘటన పారిస్ ఒలింపిక్స్‌కి రెండు వారాల తర్వాత జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. మ్యాచ్ సమయంలోనే ఒక ఆటగాడు పర్సన్‌ను వీడియో తీసి అతడిపై కేసు పెట్టి ఆ సాక్ష్యాన్ని సమర్పించాడు. ఈ విషయంపై విచారణ జరిపిన BWF, అతడు దర్యాప్తులో సహకరించలేదని తెలిపింది.
పర్సన్ 2008లో యూరోపియన్ ఛాంపియన్‌షిప్ సింగిల్స్ విభాగంలో రజత పతకం గెలుచుకున్నాడు. కోచ్‌గా ఉన్న సమయంలో ఈ వివాదం బహిర్గతం కావడంతో ఆంటోన్సన్ వెంటనే అతన్ని తన కోచింగ్ సిబ్బందిలోంచి తొలగించాడు. ప్రస్తుతం ఆంటోన్సన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్నాడు.
సహించేది లేదు..!
పర్సన్ ఇంతకుముందే ఒకసారి బెట్టింగ్ కారణంగా నిషేధానికి గురయ్యాడు. మళ్లీ అదే తప్పు చేయడంతో ఈసారి BWF కఠినంగా వ్యవహరించింది. అంతే కాకుండా తప్పుడు పేరుతో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ అకౌంట్ సృష్టించి, టోర్నీ మైదానంలో కోచ్‌గా ఉండటం వల్ల ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ పొందినట్లు BWF పేర్కొంది.
‘బ్యాడ్మింటన్‌లో ఎటువంటి రూపంలోనైనా బెట్టింగ్‌ను మేము సహించము. ఎవరికైనా ఇలాంటి అక్రమ చర్యలు కనిపిస్తే వెంటనే నివేదించాలి’ అని బీడబ్ల్యూఎఫ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
టోక్యో మ్యాచ్‌లో పర్సన్ మొత్తం 9 బెట్లు పెట్టాడు. మొత్తం 5,205 డానిష్ క్రోన్ (దాదాపు రూ. 67వేలు) పెట్టుబడి పెట్టి, అందులో ఏడు బెట్లు గెలిచి 9,821 క్రోన్ (సుమారు రూ. 1.23 లక్షలు) గెలుచుకున్నాడు.









Comments