ఢిల్లీ యువతి అల్లిన యాసిడ్ దాడి కథ
న్యూఢిల్లీ : ‘‘ఆదివారం అయినా అదనపు తరగతులు ఉండటంతో కాలేజీకి వెళుతున్నాను. రోడ్డు మీద వెళుతున్న నాపై ద్విచక్రవాహనం మీద వచ్చిన ఓ ముగ్గురు యాసిడ్ మాదిరి ద్రావణాన్ని పోశారు. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడంతో ఆ ద్రావణం చేతుల మీద పడి గాయాలయ్యాయి’’.. ఇదీ.. ఢిల్లీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఓ 19 ఏళ్ల యువతి పోలీసులకు చేసిన ఫిర్యాదు! జితేంద్ర అనే వ్యక్తి తనను కొన్నాళ్లుగా వెంబడిస్తున్నాడని.. ఆ రోజు ఆ వ్యక్తే ద్విచక్రవాహనాన్ని నడుపుతుండగా.. ఇషాన్, ఆర్మాన్ అనే ఇద్దరు అన్నదమ్ములు వెనుక కూర్చున్నారని.. ఇషాన్, అర్మాన్‌కు ఓ బాటిల్ ఇవ్వగా అతడు అందులోని ద్రావణాన్ని తనపై చల్లాడని ఘటనను పూసగుచ్చినట్లు వివరించింది. యువతి రెండు చేతులకు కాలిన గాయాలయ్యాయి. టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో ఈ వార్త తీవ్రకలకలం సృష్టించింది. నిందితుల ఆట కట్టించాలని రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో నోరెళ్లబెట్టేలా చేసే పరిణామాలు తెలిశాయి. యాసిడ్ దాడి అంటూ యువతి చెబుతున్నదంతా కట్టుకథ అని పోలీసులు తేల్చారు.
బయటపడ్డ యువతి తండ్రి లీలలు
ఎవరైతే ముగ్గురిపై ఆమె ఆరోపణలు చేసిందో వారిలో జితేంద్ర అనే వ్యక్తి భార్యను యువతి తండ్రి అఖిల్ ఖాన్ లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఓ రెండ్రోజుల ముందే జితేంద్ర భార్య పోలీసులకు అఖిల్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. తాను 2021-24 మధ్య అఖిల్‌ఖాన్ ఫ్యాక్టరీలో పని చేశానని.. అక్కడ ఓసారి అతడు తనపై దాడి చేసి, అభ్యంతరకర రీతిలో ఫొటోలు, వీడియోలు తీశాడని.. బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. మరి.. ఇషాన్, అర్మాన్‌లపై ఆ యువతి ఎందుకు ఫిర్యాదు చేసినట్లు? అంటే.. తమ తల్లిపైనా అఖిల్ ఖాన్ వేధింపులకు పాల్పడ్డారంటూ ఇషాన్, అర్మాన్ కేసు పెట్టారు. ప్రతీకారం తీర్చుకునేందుకే జితేంద్ర, ఇషాన్, అర్మాన్‌పై అఖిల్ ఖాన్ కూతురైన యువతి ఇలా ఫేక్ స్టోరీ అల్లిందని విచారణలో పోలీసులు తేల్చారు. అఖిల్‌ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు. తన కూతురు చేతులపై పడింది యాసిడ్ కాదని.. టాయిలెట్ క్లీనర్ ద్రావణం అని, దాన్ని ఆమే తనకు తానుగా చల్లుకుందని చెప్పాడు. తనపై యాసిడ్ దాడి జరిగినట్లుగా యువతి చెబుతున్న ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించగా అందులో దాడి జరిగినట్లుగా కనిపించలేదు. దాడి జరిగిన రోజు.. జితేంద్ర మరోచోట ఉన్నాడని.. ఇషాన్, అర్మాన్ అసలు ఢిల్లీలోనే లేరని తేలింది.










Comments