ప్రాణం పోతున్నా.. పట్టించుకోలా
బొబ్బిలి : అది జనసంచారం ఎక్కువగానే ఉన్న ప్రాంతం. అలాంటి చోట ఓ వృద్ధురాలు రోడ్డు పక్కన పడిపోయి.. నోటివెంట రక్తం కారుతూ విలవిల్లాడుతుతోంది. చిన్న పిల్లలైన ఆమె మనవడు, మనవరాలు ఏం చేయాలో పాలుపోక రోదిస్తూ.. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయినా.. సాయం చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. చివరకు అటుగా వెళ్తున్న ఎస్‌ఐ గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఈ హృదయ విదారక ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బొబ్బిలి గొల్లవీధికి చెందిన బొట్ల ఆదమ్మ (65) నాలుగైదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. కూలి పనులు చేసుకుని పొట్ట పోసుకునే ఆమె.. మంగళవారం తన మనవడు, మనవరాలిని తోడు తీసుకుని చికిత్స కోసం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. బీపీ మాత్రలు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా గొల్లపల్లి ఆటోస్టాండ్ వద్ద కళ్లు తిరిగి పడిపోయింది. నోటివెంట రక్తం రావడం మొదలైంది. ఆమె మనవడు, మనవరాలు విలపిస్తున్నా.. అటుగా వెళ్లే జనం సాయం చేసేందుకు ముందుకు రాలేదు. అటుగా వెళ్తున్న ఎస్‌ఐ రమేశ్ గమనించి ఆమెకు సపర్యలు చేశారు. ఆటోలో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతదేహాన్ని ఇంటికి పంపించి, అంత్యక్రియల కోసం కొంతమొత్తాన్ని ఎస్‌ఐ సమకూర్చారు. ఆదమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదమ్మ బీపీ మాత్రల కోసం వచ్చిందని, బీపీ ఎక్కువగానే ఉండడంతో సీహెచ్‌సీకి రిఫర్ చేశామని గొల్లపల్లి యూపీహెచ్‌సీ డాక్టర్ అనిత తెలిపారు. ఆమె మాత్రలు తీసుకుని వెళ్లిపోయిందని, తర్వాతేం జరిగిందో తమకు తెలీదని చెప్పారు.
Comments