• Apr 01, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : ఇరాన్‌ యుద్ధ ప్రభావం భారత ఫార్మా రంగాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా ముడిసరకు దిగుమతిపై తీవ్ర ప్రభావం పడుతోంది. తయారైన మందుల ఎగుమతి మీద కూడా ప్రభావం గట్టిగానే ఉందని ఫార్మారంగ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఔషధ కంపెనీలు గల్ఫ్‌ దేశాల నుంచి ప్రధానంగా పెట్రో కెమికల్‌ సాల్వెంట్స్‌, కెమికల్‌ ఇంటర్మీడియట్స్‌, పాలిమర్స్‌ను దిగుమతి చేసుకుంటాయి. ఔషధాల తయారీ ప్రక్రియలో రసాయనాలను కరిగించేందుకు లేదా కలిపేందుకు కొన్ని ద్రావణాలు (సాల్వెంట్స్‌) అవసరం. ఇవి ముడి చమురు నుంచి వస్తాయి. పలు రకాల ఔషధాల తయారీలో ప్రాథమికంగా వినియోగించే మెథనాల్‌, యాంటీబయాటిక్స్‌, ఇతర మాత్రల తయారీలో క్లీనింగ్‌, ప్రాసెసింగ్‌ కోసం వినియోగించే అసిటోన్‌, ఆస్పిరిన్‌ వంటి నొప్పి నివారణ మందుల తయారీకి ముడిసరకుగా వాడే ఫినాల్‌, శానిటైజర్లు, ఇతర ఔషధాల తయారీలో కీలకమైన ఐసోప్రోఫైల్‌ ఆల్కహాల్‌ వంటివి గల్ఫ్‌ దేశాల నుంచి ప్రధానంగా దిగుమతి చేసుకుంటామని ఔషధరంగ నిపుణులు చెబుతున్నారు. కెమికల్‌ ఇంటర్మీడియట్స్‌కు సంబంధించి ఔషధంలో ప్రధాన భాగమైన యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియన్ట్‌(ఏపీఐ) గల్ఫ్‌ దేశాల నుంచే వస్తాయి. మందుల సీసాలు, స్ర్టిప్స్‌ తయారీకి అవసరమైన ఇథిలీన్‌, ప్రొపిలీన్‌ ఉత్పన్నాలను, సల్ఫర్‌ ఆధారిత మందుల తయారీకి అవసరమైన సల్ఫర్‌ ముడిసరకును సౌదీ అరేబియా, యూఏఈల నుంచి భారతీయ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఖతార్‌ నుంచి ఔషధ తయారీలో వాడే సహజవాయువు(ఎల్‌ఎన్‌జీ), ఇతర గ్యాస్‌ ఆధారిత ముడి రసాయనాలను దిగుమతి చేసుకుంటారు. హైదరాబాద్‌ ఫార్మా కంపెనీలు ఔషధాలను తయారు చేయడానికి కావాల్సిన మౌలిక రసాయనాల కోసం గల్ఫ్‌ దేశాల మీదే ఆధారపడుతున్నాయని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నారు. యుద్ధం వల్ల మెడికల్‌ డివైసెస్‌ తయారీ ముడి పదార్థాల ధరలు సైతం పెరిగినట్లు ఔషధ నియంత్రణ అధికారులు చెబుతున్నారు.

    నెలకు రూ.500 కోట్ల అదనపు భారం

    ఇరాన్‌ యుద్ధ భయంతో నౌకల రవాణాపై సందిగ్ధం నెలకుంది. దీంతో రవాణా చార్జీలు పెరగడంతో పాటు సరఫరా ఆగిపోయి హైదరాబాద్‌ ఫార్మా కంపెనీలకు నెలకు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల అదనపు భారం పడుతోందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. గల్ఫ్‌ దేశాలకు హైదరాబాద్‌ నుంచి వెళ్లే మందుల వాటా సుమారు 5.5 శాతం తగ్గింది. దీనివల్ల ఒక్క మార్చి నెలలోనే ఎగుమతులపై సుమారు రూ.5 వేల కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉందని ఫార్మెక్సిల్‌ సంస్థ అంచనా వేసింది. భారత ఫార్మారంగంలో 40శాతంఉత్పత్తి హైదరాబాద్‌లోనే జరుగుతోంది.

    ముడి సరుకు భారంతో పెరుగుతున్న ఔషధ ధరలు

    ఓడల రవాణా తగ్గిపోవడంతో ముడిసరుకు దిగుమతి భారంగా మారింది. దాంతో ఔషధ కంపెనీలు తమ ఉత్పత్తుల మీద ధరలు పెంచాయి. దీంతో కీలక ఔషధాల ధరలు పెరిగే పరిస్థితి ఏర్పడింది. పారాసీటమాల్‌ మందుల ధర కిలో రూ.250 నుంచి రూ.450 వరకు పెంచాయి. నైమెసులైడ్‌ ధరను రూ.425 నుంచి రూ.650 వరకు పెంచాయి. గ్లిజరిన్‌ మూడు నెలల్లో 64 శాతం పెరిగింది. ఒక్కో షిప్‌మెంట్‌పై అదనంగా సుమారు రూ.3.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు సర్‌చార్జీ విధిస్తున్నారు. లాజిస్టిక్‌ ఖర్చులు కూడా 30 శాతం - 50 శాతం పెరిగినట్లు పోర్టు అధికారులు చెబుతున్నారు.ముడిసరకు ధరలు 150 శాతం - 200 శాతం వరకు పెరగడం వల్ల హైదరాబాద్‌ కేంద్రంగా ఉండే ఔషధ కంపెనీలు గరిష్ఠ అమ్మకం ధరను 20 శాతం నుంచి 25 శాతం వరకు పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇన్సులిన్‌, వ్యాక్సిన్‌ వంటి శీతల నిల్వతో రవాణా చేసే మందుల ఖర్చు కంపెనీలకు భారంగా మారుతోంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే పరోక్షంగా రోగులపై అదనపు భారం పడుతుందని, వైద్య పరికరాలు, ఔషధాల ధరలు పెరగుతాయని, దిగుమతి చేసుకునే పరికరాలు, డయాగ్నస్టిక్‌ భాగాలు రావడం ఆలస్య అవుతోంది. అలాగే మధ్య ప్రాశ్చ్య దేశాల నుంచి వైద్య చికిత్సల కోసం మన దేశానికి వచ్చే(మెడికల్‌ టూరిజం) వారి సంఖ్య తగ్గిందని వైద్యులు చెబుతున్నారు. యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే ఔషధ రంగంలో సంక్షోభం తలెత్తే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement