భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు బ్రేక్.. భద్రతా అనుమతులపై కేంద్రం సమీక్ష
ఢిల్లీ : ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కి సంబంధించిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభానికి భారత్‌లో మరింత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. సంస్థకు అవసరమైన తుది భద్రతా అనుమతులను కేంద్ర హోంశాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో భారత్‌లో స్టార్‌లింక్ కమర్షియల్ సేవల ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. ఇటీవల ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో స్టార్‌లింక్ టెర్మినల్స్ వినియోగంపై వచ్చిన నివేదికలు భారత భద్రతా సంస్థల్లో ఆందోళనకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ భద్రత, సార్వభౌమాధికారం, నిఘా వ్యవస్థల పరిరక్షణకు సంబంధించి స్టార్‌లింక్ పూర్తిస్థాయిలో భారత నిబంధనలకు కట్టుబడి ఉంటుందా అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ముఖ్యంగా విదేశీ ప్రభుత్వాలు లేదా అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం వల్ల సేవల నిర్వహణలో మార్పులు వస్తే, భారత ప్రభుత్వానికి అవసరమైన నియంత్రణ, పర్యవేక్షణ అధికారాలు ఉంటాయా అనే అంశాలపై అధికారులు సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. అయితే, ఇరాన్‌కు సంబంధించిన వివాదాలపై వస్తున్న వార్తలను స్టార్‌లింక్ ప్రతినిధి లారెన్ డ్రేయర్ ఖండించారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. భారత్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘బెస్పోక్ డిప్లాయ్‌మెంట్ మోడల్’ సిద్ధం చేశామని, భారత భద్రతా అవసరాలకు అనుగుణంగా సేవలను అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
భద్రతా అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో శాటిలైట్ స్పెక్ట్రమ్ ధరల నిర్ణయానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ ప్రక్రియ కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీనిని శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో కీలక అంశంగా భావిస్తున్నారు. ఏడాది క్రితమే 'GMPCS' లైసెన్స్ వచ్చినా.. కమర్షియల్ సేవల కోసం ఇంకా వేచిచూడాల్సిందేనని అధికారులు తెలిపారు. దీంతో వినియోగదారులు, టెలికాం రంగం ఎదురుచూస్తున్న స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు మరికొంత కాలం ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.










Comments