• Oct 29, 2025
  • NPN Log

    హైదరాబాద్‌ : మావోయిస్టు పార్టీలో లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. మంగళవారం మరో ఇద్దరు అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ శంకరన్న అలియాస్‌ చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్‌ అలియాస్‌ ప్రభాత్‌ అలియాస్‌ బండి దాదా తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వీరిద్దరు లొంగిపోయారని డీజీపీ తెలిపారు. పుల్లూరి ప్రసాదరావు పేరిట రూ.25 లక్షల రివార్డు, బండి ప్రకాష్‌ పేరిట రూ.20 లక్షల రివార్డు ఉండగా.. ఆ మొత్తానికి సంబంధించిన డీడీలను వారికి డీజీపీ అందజేశారు. తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటివరకు 427 మంది మావోయిస్టులు లొంగిపోయారని శివధర్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, ఎనిమిది మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇద్దరు డివిజనల్‌ కమిటీ కార్యదర్శులు, 8 మంది డివిజనల్‌ కమిటీ సభ్యులు, 35 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారని తెలిపారు. ఇంకా మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన 64 మంది వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర కమిటీ సభ్యులుగా ఐదుగురు, రాష్ట్ర కమిటీ సభ్యులుగా 10 మంది, డివిజనల్‌, ఏరియా కమిటీల్లో 34 మంది, దళ సభ్యులుగా మరో 10 మంది ఉన్నారని వెల్లడించారు. కేంద్ర కమిటీలో ఇంకా మిగిలిన 9 మందిలో తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, పాక హన్మంతు అలియాస్‌ ఉకే గణేష్‌, మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌, నరహరి అలియాస్‌ విశ్వనాథ్‌ మాత్రమే తెలంగాణకు చెందినవారని తెలిపారు.


    ఆర్‌ఎస్‌యూ నుంచి అజ్ఞాతంలోకి..

    45 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో కొనసాగిన పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న స్వస్థలం పెద్దపల్లి జిల్లా వడ్కాపూర్‌ గ్రామం. ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుల్లూరి శ్రీనివాసరావు, వరలక్ష్మి దంపతులకు రెండో సంతానంగా 1961లో ప్రసాదరావు జన్మించారు. 1979లో పెద్దపల్లి జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న సమయంలో ప్రసాదరావుకు రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌(ఆర్‌ఎ్‌సయూ)తో పరిచయాలు ఏర్పడ్డాయని, అప్పటి ఆర్‌ఎస్‌యూ ఆర్గనైజర్‌ దగ్గు రాజలింగుతో కలిసి అందులో చేరి పనిచేయడం ప్రారంభించారని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. అదే క్రమంలో నాటి పీపుల్స్‌వార్‌ సీనియర్‌ నేత కిషన్‌జీకి కొరియర్‌గా పనిచేశారని వెల్లడించారు. హైదరాబాద్‌, కరీంనగర్‌ ప్రాంతాల్లో పనిచేస్తున్న నాటి పీపుల్స్‌వార్‌లోని కొండపల్లి సీతారామయ్య వర్గానికి చెందిన నాయకులకు సమాచారాన్ని అందించడంలో ప్రసాదరావు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. 1981లో పీపుల్స్‌వార్‌ కేఎస్‌ గ్రూపు ఇతర రాష్ట్రాల్లోని మార్క్సిస్టు, లెనినిస్టు వర్గాలతో విలీనమై.. సీపీఐ(ఎంల్‌-పీపుల్స్‌వార్‌)గా ఏర్పడిందని, అప్పటినుంచి సిర్పూర్‌, చెన్నూరు దళాల్లో పనిచేసిన చంద్రన్న 1995లో రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యారని పేర్కొన్నారు. పార్టీకి చెందిన ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్లను సమన్వయం చేసుకుంటూ, నార్త్‌ తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కమిటీగా మారిన పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా కార్యకలాపాలు నిర్వహించారని శివధర్‌రెడ్డి వివరించారు. అనారోగ్యం, పార్టీలో సిద్ధాంతపరమైన విభేదాలు ఆయన జనజీవన స్రవంతిలోకి రావడానికి కారణమయ్యాయని తెలిపారు.

     

    సికాస ద్వారా బండి ప్రకాష్‌..

    లొంగిపోయిన మరో మావోయిస్టు నేత బండి ప్రకాశ్‌ స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. సింగరేణి కార్మికుడు బండి రామారావు, అమృతమ్మ దంపతులకు రెండో సంతానం. 1982-84 మధ్య ఆర్‌ఎస్‌యూలో పనిచేస్తూ సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) ఆవిర్భావం తరువాత మావోయిస్టు పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రెస్‌టీం ఇన్‌చార్జిగా, సింగరేణి కోల్‌బెల్ట్‌ కమిటీ బాధ్యుడిగా మావోయిస్టు పార్టీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన బండి ప్రకాష్‌ 1984లో పుల్లూరి ప్రసాదరావు ద్వారా సిర్పూర్‌ సాయుధ దళంలో చేరారని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఇంటికి చేరుకున్నారని, 1984లో ఏఐటీయూసీ నాయకుడు వీటీ అబ్రహంను హత్య చేసిన ముఠాలో ఉన్నారని, అప్పటినుంచి మళ్లీ పార్టీలోకి వెళ్లి దీర్ఘకాలం పనిచేశారని వెల్లడించారు. పార్టీలోని అంతర్గత విబేధాలు, అనారోగ్యం ఆయన లొంగుబాటుకు కారణమని తెలిపారు. కాగా, లొంగిపోయే మావోయిస్టులకు పూర్తి భద్రత కల్పిస్తామని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని డీజీపీ స్పష్టం చేశారు. లొంగిపోయిన వారిని ఏ విధంగా కాపాడుకోవాలో తమకు తెలుసునన్నారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ మహేష్‌ భగవత్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ విజయ్‌కుమార్‌, ఎస్‌ఐబీ చీఫ్‌ సుమతి పాల్గొన్నారు.

    ప్రజాక్షేత్రంలో పనిచేయడానికే వచ్చాం

    తమది లొంగుబాటు కాదని పుల్లూరి ప్రసాదరావు అన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వచ్చామని తెలిపారు. ఆయన ‘లాల్‌ సలామ్‌’ అంటూ నినదించి మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్లు జనం కోసం పనిచేసిన తాము ఇకపై జనంలోనే ఉండి పోరాటం చేస్తామన్నారు. అనారోగ్య సమస్యలతో తాము బయటకు వచ్చామని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ భావజాలాన్ని ఓడించడం ఎవరి తరమూ కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో నష్టాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. తమ సిద్ధాంతం ఓడిపోలేదని, మళ్లీ జనంలో పుట్టుకొస్తుందని వ్యాఖ్యానించారు. పార్టీలో అంతర్గత చీలిక వచ్చిందని, ఆయుధాలతో లొంగిపోవాలని కొందరు, ఆయుధాలు వదిలి బయటకు వెళదామని మరికొందరు అనుకున్నారని చెప్పారు. ఇందులో తమ పార్టీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ పక్షానే తాము ఉంటామని, ఆయనకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇటీవల ఆయుధాలతో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్‌ విధానాలకు తాము వ్యతిరేకమన్నారు. మరికొన్ని రోజుల్లో తాము మీడియా సమావేశం ఏర్పాటు చేసి మావోయిస్టు పార్టీలో జరిగిన అంతర్మథనాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు.

    లొంగుబాటు తప్పంటూనే..!

    మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ సోనూ లొంగుబాటును తీవ్రంగా తప్పుబట్టి, ఆయుధం వదిలేదే లేదంటూ ప్రకటనలు చేసిన మావోయిస్టుల్లో పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్‌ చంద్రన్న కూడా ఒకరు. మల్లోజుల లొంగుబాటు సమయంలో పార్టీ క్యాడర్‌కు 23 పేజీల లేఖ రాశారు. సాయుధ పోరాట విరమణపై అందరి అభిప్రాయాలు కోరారు. దానికి స్పందనగా తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ పేరిట పుల్లూరి ప్రసాదరావు ఓ ప్రకటన విడుదల చేశారు. సోనూ ఉద్యమ ద్రోహి అంటూ మండిపడ్డారు. లొంగిపోవాలనుకునేవారు పార్టీకి ఆయుధాలు అప్పగించాలని ఆదేశించారు. కానీ ఇప్పుడు పుల్లూరి ప్రసాదరావుతోపాటు బండిప్రకాశ్‌ కూడా లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే తమకన్నా ముందే వీరిద్దరూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో టచ్‌లో ఉన్నారని మల్లోజుల వర్గానికి చెందినవారు పేర్కొంటుండటం గమనార్హం.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement