యూపీఐ పేమెంట్స్.. మే నెలలో సరికొత్త రికార్డు..
దేశంలో డిజిటల్ చెల్లింపులు శరవేగంగా పెరుగుతున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ద్వారా జరిగిన లావాదేవీలు మే నెలోలో కొత్త రికార్డులు సృష్టించాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మే నెలలో యూపీఐ ద్వారా మొత్తం రూ.29.9 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. వేసవి సెలవుల కారణంగానే యూపీఐ చెల్లింపులు పెరిగినట్టు ఎన్‌పీసీఐ భావిస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో యూపీఐ ద్వారా రూ.29.03 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ట్రాన్సాక్షన్ల విలువ గణనీయంగా పెరిగింది. కాగా, గతేడాది మే నెలలో రూ.24.14 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. గతేడాదితో పోల్చుకుంటే 19 శాతం వృద్ధి నమోదైంది. అలాగే గతేడాది మే నెలలో లావాదేవీల సంఖ్య 1867 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది మే నెల నాటికి ఏకంగా 24 శాతం వృద్ధితో 2320 కోట్లకు చేరింది.
దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులపై ప్రజల్లో విశ్వాసం పెరగడం, స్మార్ట్‌ఫోన్ వినియోగం విస్తరించడం, క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులు సాధారణమవడం వల్ల యూపీఐ వ్యవస్థ మరింత బలోపేతమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. రిటైల్ చెల్లింపుల్లో నగదు వినియోగం క్రమంగా తగ్గుతుండగా, డిజిటల్ చెల్లింపులు సాధారణ జీవనశైలిలో భాగమయ్యాయి.










Comments