విమానాలకు అంతరాయం
హైదరాబాద్ : మొంథా తుఫాన్ ప్రభావంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు మంగళవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రికి వెళ్లిరావాల్సిన 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో ఎవరు కూడా ఈ మూడు ప్రాంతాలకు విమాన టికెట్లు బుక్ చేసుకోవొద్దని ఎయిర్‌లైన్స్ అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 3 విమానాలు, ఇండిగో 15 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులకు టికెట్ డబ్బులు వాపస్ ఇస్తామని ఎయిర్‌లైన్స్ ప్రకటించారు. తుఫాన్ తీవ్రతను ముందుగానే అంచనా వేసిన దక్షిణమధ్యరైల్వే అధికారులు జోన్ పరిధిలోని 92 రైళ్లను మంగళవారం నుంచే రద్దు చేయగా, తాజాగా బుధ, గురువారాల్లో మరో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖపట్నం వెళ్లే (18520) ఎక్స్‌ప్రె్‌సతో పాటు ముంబై-భువనేశ్వర్ మధ్య నడిచే (11019) కోణార్క్, విశాఖపట్నం-మహబూబ్‌నగర్ మార్గంలో నడిచే (12861) ఎక్స్‌ప్రెస్ కూడా రద్దయ్యాయని సీపీఆర్‌వో శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొంథా తుఫాను ప్రభావంతో బుధవారం మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.









Comments