శ్రీశైలం రహదారిపై విరిగిపడిన కొండచరియలు
శ్రీశైలం : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై లింగాలగట్టు వద్ద బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో తెలంగాణ వైపునకు బయల్దేరిన వాహనాలన్నీ శ్రీశైలంలో చిక్కుకుపోయాయి. పోలీసులు కొండచరియలను ఎక్స్‌కవేటర్ సాయంతో తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మరోవైపు భారీవర్షాల కారణంగా రోడ్ క్లియరెన్స్ లేకపోవడంతో ఫారెస్ట్ అధికారులు శ్రీశైలం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో యాత్రికుల వాహనాలు టోల్‌గేట్ వద్ద బారులుదీరాయి. బస్సులు కదలకపోవడంతో వందలాది మంది యాత్రికులు అవస్థలు పడ్డారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో అల్పాహారం, మంచినీరు, పాలు, బిస్కెట్లను బస్టాండ్, ఔటర్ రింగ్‌రోడ్డు, శిఖరం ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్దకు తరలించి యాత్రికులకు అందించారు. సాయంకాలానికి దోర్నాలవైపు నుంచి కర్నూలు, విజయవాడ వెళ్లే వాహనాలను అధికారులు అనుమతించారు.









Comments