స్టీల్ ఫ్లాస్క్ శుభ్రం ఇలా...
రోజూ కార్యాలయాలకు, ప్రయాణాలప్పుడు తీసుకెళ్లే స్టీల్ ఫ్లాస్కుల్లో కాఫీ, టీ మరకలు పేరుకోవడంతోపాటు చెడు వాసన వస్తుండడం గమనిస్తుంటాం. వీటిని సులువుగా శుభ్రం చేసే చిట్కాలివే... ఫ్లాస్క్‌ను మంచినీటితో ఓసారి కడగాలి. తరువాత అందులో చెంచా బేకింగ్ సోడా వేసి ఓ కప్పు గోరువెచ్చటి నీటిని పోసి తేలికగా మూతపెట్టి ఫ్లాస్క్‌ను వేగంగా అటూ ఇటూ ఊపాలి. పది నిముషాల తరువాత ఆ నీటిని పారబోసి మెత్తటి బ్రష్‌తో ఫ్లాస్క్ లోపల, అంచుల్లో రుద్ది కడగాలి. ఇలా తరచూ చేస్తుంటే మరకలు, దుర్వాసన లేకుండా స్టీల్ ఫ్లాస్క్ కొత్తదానిలా ఉంటుంది.
స్టీల్ ఫ్లాస్క్‌లో ఓ నిమ్మకాయ రసాన్ని పిండి నిండా గోరువెచ్చటి నీటిని పోసి మూతపెట్టి అరగంటసేపు అలాగే ఉంచాలి. తరువాత పొడవాటి బ్రష్‌తో లోపల రుద్ది మంచినీటితో కడిగేస్తే సరిపోతుంది.
ఫ్లాస్క్ సైజును అనుసరించి గిన్నెలో పావు లేదా అర కప్పు వైట్ వెనిగర్‌ను తీసుకుని అంతే పరిమాణంలో గోరువెచ్చటి నీటిని పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్లాస్క్‌లో పోసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే మంచినీటితో కడిగేస్తే మరకలన్నీ తొలగిపోతాయి.
ఎక్కువసేపు స్టీల్ ఫ్లాస్క్‌ను అపరిశుభ్రంగా ఉంచకూడదు. ఫ్లాస్క్ మూత, రబ్బరు రింగులను కూడా శుభ్రం చేస్తుండాలి.
స్టీల్ ఫ్లాస్క్‌ను శుభ్రం చేసిన తరువాత లోపల తడి పూర్తిగా ఆరిన తరువాతనే మూత పెడితే దుర్వాసన రాకుండా ఉంటుంది.










Comments