• Jul 28, 2026
  • NPN Log

    జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో రాజ్యాంగ పీఠికను చదివి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీధి వ్యాపారి మహ్మద్ ఇర్ఫాన్‌ను.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కలిశారు. ఈ సందర్భంగా రాహుల్‌కు ఇర్ఫాన్ నేరుగా తన అభిప్రాయాలను వెల్లడించారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే ఆయనకు వ్యతిరేకంగా కూడా ఉద్యమం చేస్తానని స్పష్టం చేశారు.

    తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, దేశ ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఇర్ఫాన్ తెలిపారు. వలస కార్మికులు, రోజువారీ కూలీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాహుల్‌ను కోరినట్లు చెప్పారు. దేశంలో అందరికీ కనీస సౌకర్యాలు అందాలని, ఎవరూ వెనుకబడిపోకూడదని అభిప్రాయపడ్డారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోన్న రోజువారీ కూలీలు ఆర్థికంగా, మానసిక ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇర్ఫాన్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కనీస వేతనం రూ.18 వేలుగా ఉన్నప్పటికీ, చాలామంది కార్మికులు 10-11 గంటలు పనిచేసి కూడా రూ.13-14 వేలే పొందుతున్నారని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలోని లోపాలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పదో తరగతి, ఇంటర్‌కు ముందే చదువు మానేస్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోతోందని, ఐటీఐలు, పాలిటెక్నిక్‌ల విద్య వంటి అవకాశాలు పేదలకు పూర్తిస్థాయిలో అందడం లేదని తెలిపారు.

    రాహుల్ పెళ్లిపై సరదా సంభాషణ

    రాహుల్‌తో మాట్లాడుతుండగా ప్రియాంక గాంధీ ఫోన్ చేసిన విషయాన్ని కూడా ఇర్ఫాన్ వెల్లడించారు. రాహుల్‌ను పెళ్లి చేసుకోమ్మని తన తరఫున చెప్పాలని ప్రియాంక కోరగా, తాను మాత్రం రాహుల్ పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని సరదాగా చెప్పినట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలవడంపై కూడా ఇర్ఫాన్ స్పందించారు. ప్రధానిని కలవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రస్తావించాలని ఉందని చెప్పారు. తమ ప్రాంతంలో చిన్న పిల్లలకే డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసని, కానీ పోలీసులకు మాత్రం తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement