ఆరు నెలల రాబడి రూ.1.36 లక్షల కోట్లు
హైదరాబాద్ : ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రాష్ట్ర రాబడుల ద్వారా ఖజానాకు రూ.1,36,648 కోట్లు సమకూరాయి. ఈసారి బడ్జెట్లో అంచనా వేసిన మొత్తం రాబడులు రూ.3,04,207 కోట్లలో ఇది 44.92 శాతం. సాధారణంగా ఆరు నెలల వ్యవధిలో అంచనా మొత్తంలో సగం వరకైనా నిధులు సమకూరాలి. కానీ, 44.92 శాతమే సమకూరాయి. రాష్ట్ర రాబడులు, వ్యయాలపై సెప్టెంబరు నెల నివేదికను ‘కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (కాగ్) శుక్రవారం విడుదల చేసింది.
రెవెన్యూ రాబడుల కింద రూ.2,41,263 కోట్లను అంచనా వేయగా రూ.92,013 కోట్లు(38.14ు), మూలధన రాబడుల ద్వారా రూ.62,944 కోట్లను అంచనా వేయగా రూ.44,635 కోట్లు సమకూరాయి. ఈ మూలధన రాబడుల్లో బహిరంగ మార్కెట్ రుణాల ద్వారానే రూ.44,612 కోట్లు వచ్చాయి. ఈసారి మార్కెట్ రుణాల కింద రూ.61,457 కోట్లను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా... సెప్టెంబరు నాటికి రూ.44,612 కోట్ల(72.59ు) అప్పులు తీసుకుంది. కాగా... పన్నుల ద్వారా ఈసారి రూ.1,81,367 కోట్ల రాబడిని అంచనా వేయగా... రూ.82,553 కోట్ల(45.52ు) ఆదాయం వచ్చింది.
ఇందులో జీఎస్టీ ద్వారా రూ.29,565 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.9,033 కోట్లు, సేల్స్ ట్యాక్స్ ద్వారా రూ.18,830 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా రూ.10,470 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.10,667 కోట్లు సమకూరాయి. పన్నేతరాల కింద రూ.5,754 కోట్లు, కేంద్ర గ్రాంట్లు-కాంట్రిబ్యూషన్ల కింద రూ.3,706 కోట్లు వచ్చాయి. సెప్టెంబరు వరకు ప్రభుత్వం వివిధ పద్దుల కింద రూ.1,34,852 కోట్లను వ్యయం చేసింది. ఇది అంచనా వేసిన మొత్తం వ్యయం రూ.2,81,673 కోట్లలో 47.88 శాతం. సంక్షేమ పథకాల కోసం రూ.40,752 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.16,565కోట్లు, జీతభత్యాలకు రూ.25,258 కోట్లు, పింఛన్లకు రూ.14,235కోట్లు, సబ్సిడీల కోసం రూ.10,298కోట్లను వ్యయం చేసింది.









Comments