• Sep 20, 2026
  • NPN Log

    తిరుపతి(టీటీడీ) : ఆధ్యాత్మికతకు సాంకేతికతను జోడించి ఆధునికీకరించిన తిరుమలలోని ఎస్వీ మ్యూజియం భక్తులకు అద్భుత ప్రపంచాన్ని పరిచయం చేయడానికి సిద్ధమైంది. శ్రీవారి ఆవిర్భావం నుంచి ఆయన వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని భక్తులకు కళ్లకు కట్టినట్లు చూపించనుంది. మొత్తం 3.25 ఎకరాల విస్తీర్ణంలో, 1.25 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ గ్యాలరీల్లో 1,735 కళాఖండాలు ప్రదర్శనకు ఉంచారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయానికి సందర్శకులను అనుమతించనున్నారు.

    నాలుగు దశాబ్దాల చరిత్ర

    తిరుపతిలోని ఎస్వీ వర్సిటీ ప్రాంగణంలో ఉన్న ఓరియంటల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఓఆర్‌ఐ)లో పురాతన శిల్పాలను తొలుత టీటీడీ భద్రపరిచేది. 1980లో తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వెయ్యికాళ్ల మండపంలో ఎస్వీ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. దీనిని అప్పట్లో హాల్‌ ఆఫ్‌ యాంటిక్విటీ (పురాతన వస్తువులశాల) అని పిలిచేవారు. ఆలయ కళలపై ప్రత్యేకంగా 1983లో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న నమ్మాళ్వార్‌ ఆలయ ప్రాంగణంలో ఎస్వీ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. 1998లో ఎస్వీ మ్యూజియం గ్యాలరీలను వెయ్యి కాళ్ల మండపం నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు ఎదురుగా ఉన్న ప్రస్తుత భవనంలోకి మార్చారు. కొవిడ్‌ తర్వాత తిరుపతిలోని మ్యూజియాన్ని తిరుమల మ్యూజియంలో విలీనం చేశారు. తిరుమలలోని మ్యూజియం ఆధునికీకరణ పనులు 2023 ఆగస్టులో ప్రారంభమై 2026లో పూర్తయ్యాయి.

    త్రీడీలో తిరువాభరణాల దర్శనం

    మ్యూజియం కింది భాగంలో వేంకటేశ్వర స్వామి గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఇక్కడ శ్రీవారి ఆవిర్భావం నుంచి తిరుమల కొండపై స్వామి వెలిసే వరకు మొత్తం వృత్తాంతాన్ని 4 నిమిషాల నిడివితో ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ సాంకేతికత ద్వారా ప్రదర్శించనున్నారు. దీని పక్కనే ఆరు ‘హాలో క్యూబ్స్‌’ను ఏర్పాటు చేశారు. వీటిలో శ్రీవారికి రోజువారీ సేవలతో పాటు ఉత్సవాలు, పర్వదినాల్లో అలంకరించే తిరువాభరణాలను 3డీ సాంకేతికతతో భక్తులు చూసేందుకు వీలు కల్పించారు. మరో పెద్ద హాలో క్యూబ్‌లో శ్రీవారి వజ్రకిరీటం, సూర్యకటారి వంటి పెద్ద ఆభరణాలు వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ఇక, 20 అడుగుల ఒంపు కలిగిన స్ర్కీన్‌పై ‘పద్మావతి పరిణయం’ ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. దీన్ని వీక్షించేందుకు ప్రత్యేక లోకలైజ్డ్‌ స్పీకర్లు ఏర్పాటు చేశారు. వాటి కింద నిలబడిన వీక్షకులకు మాత్రమే శబ్దం వినపడుతుంది. ఇక్కడే శ్రీవారి ఆలయంలోని కులశేఖరపడి పాత తొడుగు, రాములవారిమేడ పాత ద్వారాలతో పాటు శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ధూపగంటాన్ని వీక్షించవచ్చు. ఇక గురువారం నేత్ర దర్శనం సమయంలో ఉన్న తరహాలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్వామి మూలవిరాట్టును మేల్‌ఛాట్‌ వస్త్రంతోనే వీక్షించే ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలో వాడిన పాత వస్తువులు, కల్యాణోత్సవ సింహాసనాలు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. రాతి గ్యాలరీలో విష్ణువు, శివుడు, ఇతర దేవతా మూర్తుల ప్రత్యేక విభాగాలను వీక్షించవచ్చు.

    మొదటి అంతస్తులో...

    ఈ విభాగంలో ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టు నమూనాను చూసే అవకాశం ఉంది. రాష్ట్రంలో దొరికే రాళ్లు, ఖనిజాలను ఇక్కడ చూడవచ్చు. ఆలయ మండపాల నమూనాలు, ఆలయ నిర్మాణ శైలిలో నమూనాలను కూడా వీక్షించవచ్చు. అలాగే శ్రీవారిని సేవించుకున్న భక్తులతో పాటు ఆయనకు విరివిగా విరాళాలు ఇచ్చిన దాతల చిత్రాలు ఇక్కడ ప్రదర్శించారు. సినీ నటుడు మోహన్‌లాల్‌ పాత నాణేలతో తయారు చేయించి ఇచ్చిన శ్రీవారి చిత్రాన్ని ఇక్కడ సందర్శించవచ్చు. ఇంకా తీగలు, చర్మం, గాలి ద్వారా సంగీతం వచ్చే మూడు రకాల పరికరాలతో ప్రత్యేకంగా గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఆ వాయిద్యం ముందు నిల్చుంటే అందులో నుంచి వచ్చే ధ్వనిని వీక్షకులు అనుభూతిని పొందే అవకాశం ఉంది. శివుని ఐదు ముఖాలకు ప్రతీకగా నిలిచే పంచముఖ వాయిద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వివిధ రకాలైన ఆయుధాలతో గ్యాలరీ, పూజ సమయంలో ఉపయోగించే వస్తువులతో పూజ సామగ్రి గ్యాలరీలూ ఉన్నాయి.

    రెండో అంతస్తులో..

    ఇక్కడ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఉంటారు. ఈ గ్యాలరీలోనే నాలుగు వేదాలకు ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేశారు. ఏ వేదం గదిలో ఉంటే అక్కడ ఆ వేదం వినేందుకు ఆస్కారం ఉంది.

    మూడో అంతస్తులో...

    ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రహ్మాండం గ్యాలరీ వీక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా అలౌకిక ఆనందానికి గురి చేస్తుంది. ఈ గది నాలుగు వైపులా స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. తొలుత ఇక్కడ పద్మపురాణం ఆధారంగా రూపొందించిన విశ్వం ఆవిర్భావం ఘట్టాలను చూస్తారు. ఆ తర్వాత 14 లోకాలతో పాటు బ్రహ్మ లోకం, వైకుంఠం చూపించనున్నారు. వైకుంఠం మధ్యలో లక్ష్మీ సమేతుడైన మహావిష్ణువు ఉంటారు. అక్కడి నుంచి స్వామి తిరుమల క్షేత్రానికి వచ్చిన అంశాలను వీక్షించేందుకు ఆస్కారం ఉంది. మొత్తం 9 నిమిషాల నిడివితో ప్రదర్శనను తిలకించవచ్చు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement