• Sep 20, 2026
  • NPN Log

     

    ఉరవకొండ (ఎన్ పి ఎన్ న్యూస్):

    అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో కరువు పరిస్థితులు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో, కరువును తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ విషయమై ఈ నెల 21, 22, 23 తేదీలలో నియోజకవర్గంలోని అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసన దీక్షలు నిర్వహించాలని ప్రతిపక్ష నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. శనివారం ఉరవకొండలోని సీపీఐ కార్యాలయంలో వివిధ ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

    ​సమావేశానంతరం నాయకులు మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల వల్ల ఉరవకొండ ప్రాంతంలో వేరుశనగ, కంది, పెసర, అలసంద వంటి ప్రధాన పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు పడిపోయి బోర్లు ఎండిపోవడంతో చీనీ, దానిమ్మ తదితర ఉద్యాన పంటల సాగుదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర పశుగ్రాసం, తాగునీటి కొరత ఏర్పడిందని తెలిపారు.

    ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్లు:

    • పశుగ్రాసం పంపిణీ: పశుసంపదను కాపాడుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి తక్షణమే పశుగ్రాసాన్ని తెప్పించి రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలి.
    • రుణమాఫీ & కొత్త రుణాలు: పాత వ్యవసాయ రుణాలను మాఫీ చేసి, పంటల సాగుకు అవసరమైన కొత్త రుణాలను వెంటనే మంజూరు చేయాలి.
    • విద్యుత్ సరఫరా: ఉద్యాన తోటలను కాపాడుకోవడానికి సకాలంలో అరకాని విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలి.
    • భరోసా కల్పించాలి: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి భరోసా ఇవ్వాలి.

    ​ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కేశవరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాకేట్ల అశోక్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోనియా శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు ఎర్రిస్వామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఈడిగ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు హెచ్.హెచ్.ఖాన్, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఎం.బి.చిన్నరాయుడు, సహాయ కార్యదర్శి బి.నాగేంద్ర, సీనియర్ నాయకులు గన్నే మల్లేసు, గన్నే మోహన్, మహిళా సమాఖ్య నాయకులు నర్జుహాన్, వన్నూరమ్మ తదితరులు పాల్గొన్నారు. 

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement