కనులపండువగా గరుడ సేవ
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం విశిష్టమైన గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఆలయంలోని రంగనాయక మండపంలో మలయప్ప స్వామికి పట్టుపీతాంబరాలు, వజ్ర, స్వర్ణాభరణాలను అలంకరించారు. విశేష సమర్పణ తర్వాత మంగళవాయిద్యాల మధ్య వాహన మండపానికి చేరుకున్న స్వామివారిని గరుడుడిపై అధిష్ఠింపజేసి సాయంత్రం 6.25 గంటలకు వాహన సేవను ప్రారంభించారు. వాహన మండపం తెర తీయగానే భక్తుల గోవింద నామస్మరణలతో సప్తగిరులు మార్మోగాయి. నాలుగు మాడవీధుల్లో నెమ్మదిగా స్వామిని ఊరేగిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, కళాబృందాల ప్రదర్శనలతో బ్రహ్మాండనాయకుడి గరుడోత్సవం కనులపండువగా సాగింది. గోవింద నామస్మరణలు, కర్పూర హారతులతో భక్తకోటి నీరాజనాలు పలికారు. బ్రహ్మోత్సవాల తొలి నాలుగు రోజుల్లో చాలా సాధారణంగా కనిపించిన మాడవీధులు శనివారం భక్తులతో కిక్కిరిసిపోయాయి.
తమిళులకు ఎంతో పవిత్ర మాసమైన పెరటాశి తొలివారం కూడా కావడంతో గరుడోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు భారీగానే వచ్చారు. సాయంత్రానికి మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ దాదాపు 1.80 లక్షల మందితో నిండిపోయాయి. రీఫిల్లింగ్, మాడవీధుల్లో కార్నర్ పాయింట్ల నుంచి అనుమతించి అదనంగా మరో 20వేల నుంచి 30వేల మందికి దర్శనం కల్పించారు. మరోవైపు ఆలయంలోని మూలవిరాట్టు దర్శనానికీ భక్తులు క్యూకట్టారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు నిండిపోయి, శిలాతోరణం సర్కిల్ వరకు క్యూలైన్ వ్యాపించింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర తదితరులు వాహన మండపంలో స్వామిని దర్శించుకున్నారు. కాగా, శనివారం ఉదయం శ్రీవారు మోహినీ అవతారంలో భక్తకోటికి దర్శనమిచ్చారు. అతిలోకసుందరి అలంకారంలో మలయప్పస్వామి సర్వాలంకార భూషితుడై శ్రీకృష్ణస్వామి సరసన తిరువీధుల్లో ఊరేగారు. ఆలయంలోని రంగనాయక మండపంలోనే మోహినీ అవతారం అలంకరణ చేపట్టారు. నాచ్చియార్ తిరుకోళంగా పిలిచే బంగారు చిలుకను చేతపట్టుకుని, శ్రీవిల్లిపుత్తూరు మాలలను ధరించి, శ్వేత వస్త్రధారణతో దంతపల్లకిలో వినూత్న భంగిమలో మలయప్ప ఆశీనులయ్యారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు...
ఉదయం: హనుమంత వాహనం,
సాయంత్రం: స్వర్ణ రథోత్సవం,
రాత్రి: గజ వాహనం










Comments