కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై కోనేటిరాయుడి అభయం
తిరుపతి(టీటీడీ) : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నాలుగోరోజైన శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనాలపై దేవేరులతో కలిసి మలయప్పస్వామి భక్తులను కటాక్షించారు. ఉదయం కల్పవృక్ష వాహనంలో గోపాలుడి అలంకారంలో మలయప్పస్వామి మాడవీధుల్లో విహరించారు. రాత్రి శ్రీవారు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి మాడవీధుల్లో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహించారు. కాగా.. బ్రహ్మోత్సవాల్లో ప్రఽధానమైన గరుడ సేవ శనివారం జరుగనుంది. సాయంత్రం 6.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు గరుడ వాహనంపై విహరించే గోవిందుడిని భక్తులు కనులారా వీక్షించేలా నెమ్మదిగా వాహనం సాగనుంది. గరుడ సేవతో పాటు పెరటాశి శనివారాలు(తిరుమల శనివారాలు) కూడా శనివారమే ప్రారంభమవుతున్న క్రమంలో ఈసారి గరుడోత్సవానికి భారీగా భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి తగినట్టు ఏర్పాట్లు చేపట్టింది. శుక్రవారం సాయంత్రం నుంచే తిరుమలలో రద్దీ పెరిగింది. గరుడ సేవ కోసం వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ దాదాపు 33 గంటల పాటు తిరుమలకు ద్విచక్రవాహనాల రాకపోకలను నిషేధించింది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఘాట్‌రోడ్లలో ద్విచక్రవాహనాలను అనుమతించరు.










Comments