కష్టాల్లో ఇంగ్లండ్
అడిలైడ్: యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ జట్టు మూడో టెస్ట్‌లో కష్టాల్లో పడింది. మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆఖరికి పర్యాటక జట్టు 213 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. 71/4 స్కోరుతో ఉన్న దశలో..బ్రూక్ (45), స్మిత్ (22), ఆర్చర్ (30 బ్యాటింగ్) జతగా స్టోక్స్ (45 బ్యాటింగ్) మూడు భాగస్వామ్యాలతో జట్టును ఒకింత ఆదుకున్నాడు. ఇక ఓవర్‌నైట్ 326/8 స్కోరుతో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 371 పరుగులకు ఆలౌటైంది.
మెక్‌గ్రాత్‌ను వెనక్కు నెట్టిన లయన్.: రెండో రోజు ఆటలో రెండు వికెట్లు తీసిన స్పిన్నర్ నేథన్ లయన్ (2/52) టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. 141 టెస్ట్‌ల్లో మొత్తం 564 వికెట్లు కైవసం చేసుకున్న మెక్‌గ్రాత్ (124 టెస్ట్‌ల్లో 563)ను అధిగమించాడు. షేన్ వార్న్ (145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.
స్టోక్స్ వర్సెస్ ఆర్చర్..: అదేంటి ఇద్దరూ ఇంగ్లండ్ ఆటగాళ్లే కదా..వారి మధ్య వాగ్వాదం ఏంటనుకుంటున్నారా? నిజమే..రెండో రోజు ఆటలో ఆర్చర్ బౌలింగ్ గతి తప్పడంతో ఆసీస్ బ్యాటర్లు భారీ షాట్లు కొట్టారు. దాంతో తీవ్రంగా ఆగ్రహించిన కెప్టెన్ స్టోక్స్ లైన్, లెంగ్త్ సరి చేసుకోవాలని, ఫీల్డింగ్ పొజిషన్లు మార్చాలని పదేపదే అడగొద్దని ఆర్చర్‌కు గట్టిగా సూచించాడు. స్టార్క్‌ను ఆర్చర్ అవుట్ చేసిన సందర్భంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒకచోట చేరారు. ఆ సమయంలో ఆర్చర్‌పై స్టోక్స్ మండిపడడం కనిపించింది.









Comments