• Jul 27, 2026
  • NPN Log

    వాషింగ్టన్ డీసీ : ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో అమెరికా వద్ద వైమానిక రక్షణ క్షిపణులు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయనే వార్తలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అమెరికా సైనిక శక్తిపై వస్తున్న కథనాలను తోసిపుచ్చుతూ, అమెరికా వద్ద అవసరానికంటే, చాలా ఎక్కువ స్థాయిలో ఆయుధ సంపత్తి ఉందని స్పష్టం చేశారు.

    ప్రపంచంలో ఎవరి దగ్గరా లేనంత ఆయుధ సంపత్తి మాకుంది

    'ది వాల్ స్ట్రీట్ జర్నల్'  కు తాజాగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. 'తగ్గుతున్న ఆయుధ నిల్వల వల్ల అమెరికా రక్షణ రంగానికి ఎలాంటి ముప్పూ లేదు. ప్రపంచంలో ఎవరి వద్దా లేనంత, అవసరమైన దానికంటే ఎంతో ఎక్కువ ఆయుధ సంపత్తి మా వద్ద ఉంది' అని ట్రంప్ చెప్పారు.

    పెంటాగన్ అధికారులు, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ దాన్ కేన్ వైట్ హౌస్ అంతర్గత సమావేశాల్లో వ్యక్తంచేసిన ఆందోళనలను ప్రస్తావిస్తూ 'ది న్యూయార్క్ టైమ్స్' ప్రచురించిన కథనానికి స్పందనగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    మిలిటరీ వర్గాల ఆందోళన – CENTCOM వ్యూహం

    అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, సైనిక చర్యలను మరింత తీవ్రతరం చేస్తే పేట్రియాట్ (Patriot) వంటి కీలక ఇంటర్‌సెప్టర్ల నిల్వలు అడుగంటిపోతాయని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ హెచ్చరించారు. అయితే యుఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ మాత్రం ప్రస్తుతం ఉన్న పరిమిత స్టాక్‌తోనే పరిస్థితులను నిర్వహించవచ్చని భావిస్తున్నారు. ఇరాన్ పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేయకముందే, వారి లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసేలా దాడి పరిధిని విస్తరించడమే వ్యూహమని ఆయన పేర్కొన్నారు.

    యుఎస్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ సీక్రెట్ వార్నింగ్!

    అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ దాన్ కేన్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉన్నతాధికారులతో జరిగిన రహస్య చర్చల్లో ఇరాన్‌పై తిరిగి భారీ సైనిక దాడులు ప్రారంభించడం శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు. ఇరాన్‌పై పూర్తిస్థాయి యుద్ధం సాధ్యమే అయినప్పటికీ, అది యుఎస్ సెంట్రల్ కమాండ్‌ వద్ద ఉన్న 'పేట్రియాట్' ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్ల (క్షిపణి నిరోధక వనరులు) నిల్వలను ప్రమాదకర స్థాయికి ఖాళీ చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మరోవైపు, జొర్డాన్‌లోని అమెరికన్ సైనిక స్థావరంపై ఇరాన్ దాడి జరిపి ముగ్గురు సైనికులను పొట్టనబెట్టుకున్న ఘటన తర్వాత, సైన్యానికి, మిత్రదేశాలకు రక్షణగా నిలిచే ఈ క్షిపణుల కొరతపై పెంటాగన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ కీలక రక్షణ నివేదికల నేపధ్యంలోనే, ప్రాంతీయంగా తమ బలగాలను, చమురు మౌలిక వసతులను ప్రమాదంలో పడేయకూడదనే ఉద్దేశంతో అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై తదుపరి దాడులను తాత్కాలికంగా పక్కనబెట్టినట్లు భావిస్తున్నారు.

    1,500 ఇంటర్‌సెప్టర్ల వాడకం?

    అమెరికా ఉపయోగించిన పేట్రియాట్, థాడ్ (THAAD) క్షిపణుల కచ్చితమైన వివరాలను వెల్లడించడం జాతీయ భద్రతకు ముప్పని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అయితే 'సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్' (CSIS) విశ్లేషకుల అంచనా ప్రకారం ఇప్పటివరకు దాదాపు 1,500కి పైగా పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్లు వాడినట్టు సమాచారం. ప్రస్తుతం అమెరికా వద్ద 1,000 కంటే తక్కువ ఇంటర్‌సెప్టర్లు మాత్రమే నిల్వ ఉన్నట్లు అంచనా.

    జొర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించిన ఘటన తర్వాత వైమానిక రక్షణ మరింత సవాలుగా మారింది. ఇరాన్ తన క్షిపణుల మార్గాలు, వేగాన్ని నిరంతరం మారుస్తూ అమెరికా ఇంటర్‌సెప్టర్లను ఎక్కువ సంఖ్యలో వృథా అయ్యేలా చేస్తోందని అధికారులు చెబుతున్నారు.

    తాత్కాలిక విరామం – దౌత్య మార్గాలు

    వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్, పెంటాగన్ ప్రతినిధి సీన్ పార్నెల్ అధ్యక్షుడు ఇచ్చే ఏ ఆదేశాన్నైనా అమలు చేయడానికి సైన్యానికి అవసరమైన అన్ని వనరులూ ఉన్నాయని పునరుద్ఘాటించారు. కాగా, వరుసగా 13 రోజుల పాటు కొనసాగిన వైమానిక దాడుల తర్వాత శనివారం నుంచి ఎలాంటి వైమానిక దాడులు జరగలేదని ఇరాన్ తెలిపింది. క్షిపణుల కొరతపై అంతర్గత చర్చలు, ప్రాంతీయ ఉద్రిక్తతల తీవ్రత నేపధ్యంలో అమెరికా తన దాడులకు తాత్కాలిక విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement