బెర్లిన్ ప్రైడ్ వేడుకపై ఉగ్రదాడి.. ఇస్లామిక్ తీవ్రవాద కోణంలో జర్మనీ దర్యాప్తు..
జర్మనీ రాజధాని బెర్లిన్లో అత్యంత వైభవంగా నిర్వహించిన క్రిస్టోఫర్ స్ట్రీట్ డే (ప్రైడ్) వేడుకపై ఉగ్రదాడి జరిగింది. వేడుకలో పాల్గొన్న జనాల పైకి ఒక వ్యక్తి వ్యాన్ను నడిపించాడు. కొందరిని ఢీకొట్టి, అనంతరం ఆయుధాలతో దాడి చేశాడు. ఈ దాడిలో ఒక మహిళ చనిపోగా, 29 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో అతివాద ఇస్లామిక్ ఉగ్ర ముఠాల హస్తం ఉండొచ్చని జర్మనీ దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. 21 ఏళ్ల అబ్దుల్ బల్లోట్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతడికి గతంలో కూడా తీవ్రవాద భావజాలంతో సంబంధాలు ఉన్నాయని, నేరచరిత్ర కూడా ఉందని జర్మన్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం లభించిన ఆధారాలన్నీ ఈ ఘటన ఇస్లామిక్ తీవ్రవాద ప్రేరేపిత దాడేనని సూచిస్తున్నాయని జర్మనీ అంతర్గత మంత్రి అలెగ్జాండర్ డోబ్రింట్ తెలిపారు.
దాడి అనంతరం పరారైన నిందితుడి కోసం దేశవ్యాప్తంగా గాలింపు చేపట్టిన పోలీసులు, అతడిని బెర్లిన్లో గుర్తించారు. అరెస్టు చేస్తున్న సమయంలో అతడు కత్తితో పోలీసులపై దాడి చేశాడు. దీంతో అధికారులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.









Comments