• Oct 24, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికం (క్యూ2)లో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 36 శాతం క్షీణించి రూ.913.40 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,426.80 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా 1.5 శాతం క్షీణించి రూ.8,805 కోట్ల నుంచి రూ.రూ.8,670.8 కోట్లకు తగ్గింది. అమెరికా మార్కెట్లో ప్రధానంగా క్యాన్సర్‌ ఔషధం లెనాలిడోమైడ్‌ విక్రయాలు పడిపోవటంతో ఆదాయం, లాభం తగ్గుముఖం పట్టిందని డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. మరోవైపు వ్యయాలు కూడా రూ.3,062.70 కోట్ల నుంచి రూ.3,252.10 కోట్లకు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే మాత్రం లాభం ఏకంగా 109 శాతం పెరగగా ఆదాయం 7.4 శాతం వృద్ధి చెందింది. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ వ్యాపారం మరింతగా మెరుగుపడిందని, రానున్న రోజుల్లో కీలక వ్యాపారాన్ని బలోపేతం చేయటంపై దృష్టి పెట్టడంతో పాటు వృద్ధికి అవకాశమున్న వ్యూహాత్మక ప్లాట్‌ఫామ్స్‌పై పెట్టుబడులు పెట్టనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ కో చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ వెల్లడించారు.

    23శాతం తగ్గిన అమెరికా ఆదాయం: సెప్టెంబరు త్రైమాసికంలో అమెరికా ఆదాయం 23 శాతం తగ్గి రూ.2,489 కోట్లుగా నమోదైంది. అయుతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంతో పోల్చితే మాత్రం రెవె న్యూ 13 శాతం వృద్ధి చెందింది. లెనాలిడోమైడ్‌ అమ్మకాలు తగ్గటమే ఇందుకు కారణం. కాగా త్రైమాసిక కాలంలో అమెరికా మార్కెట్లోకి మొత్తం 6 కొత్త ఔషధాలను విడుదల చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. సెప్టెంబరు ముగిసే నాటికి యూఎస్‌ ఎఫ్‌డీఏ వద్ద మొత్తం 80 అబ్రివేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్స్‌ (అండా) పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. యూరప్‌ ఆదాయాలు మాత్రం 1 శాతం వృద్ధి చెంది రూ.1,390 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. భారత మార్కెట్‌ ఆదాయాలు ఏకంగా 17 శాతం వృద్ధితో రూ.1,850 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొంది.

    పశ్చిమాసియా ఒత్తిళ్లున్నాయ్‌..: సెప్టెంబరు త్రైమాసికంలో పశ్చిమాసియా యుద్ధంతో వ్యయాలు పెరిగిపోయాయని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ సీఎ్‌ఫఓ ఎంవీ నరసింహం తెలిపారు. కీలక స్టార్టింగ్‌ మెటీరియల్స్‌, సాల్వెంట్స్‌ సహా లాజిస్టిక్‌ వ్యయాలు కంపెనీ పనితీరుపై ప్రభావం చూపించాయని ఆయన పేర్కొన్నారు. కాగా యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ)కు సంబంధించిన సమస్యలు పరిష్కారమైన తర్వాత నవంబరులో సెమాగ్లుటైడ్‌ ఔషధాన్ని మళ్లీ మార్కెట్లోకి విడుదల చేయాలని చూస్తున్నట్లు నరసింహం తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో, నాలుగో త్రైమాసికంలో 10 మార్కెట్లలోకి 60-70 లక్షల సెమాగ్లుటైడ్‌ ప్యాక్స్‌ను సరఫరా చేయవచ్చని అంచనా వేస్తోంది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement