• Aug 25, 2026
  • NPN Log

    హైదరాబాద్‌: 22ఏ భూముల వ్యవహారంలో ప్రభుత్వ పరంగా తప్పు జరిగితే సరిదిద్దుకుంటామని.. అక్రమాలకు పాల్పడి సర్కారు భూములను కాజేయాలనుకుంటే మాత్రం వదిలిపెట్టబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హెచ్చరించారు. ప్రైవేటు ఆస్తులు 22ఏలో ఉన్నంత మాత్రాన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 22ఏ పేరుతో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. సచివాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22ఏ వివాదంపై ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని చెప్పారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గంలోని రెండు రెవెన్యూ గ్రామాల్లో 122 ఎకరాలు, మరో చోట 400 ఎకరాలు కలిపి 522 ఎకరాలు ప్రభుత్వ భూమికి సంబంధించిన వ్యవహారాలను మంత్రి ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందన్నారు. ఇలాంటి భూములు నిషేఽధిత జాబితాలో పెట్టడం తప్పా అని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో 1958కి ముందు రికార్డు ఉన్నట్లు చూపి.. గత ప్రభుత్వంలో అబద్ధాల రావు (హరీశ్‌రావునుద్దేశించి) భూములపై హక్కులు సృష్టించి ధారాదత్తం చేశారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ సర్వే నంబరు 403లో సుమారు 1,288 ఎకరాల విస్తీర్ణముంటే అందులో కేవలం రెండు ప్లాట్లు మాత్రమే 22ఏ జాబితాలో ఉన్నాయన్నారు. మొత్తం సర్వే నంబరును 22ఏలో చూపడం వల్ల సీఎం నివాసంతో పాటు తన నివాసం కూడా నిషేధిత జాబితాలో చేరిందన్నారు. దాన్ని గుర్తించి వెంటనే సరిచేశామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో సర్వే నంబరు 172 ప్రభుత్వ భూమి, 173 ప్రైవేటు భూమి.. అయితే 173 పేరుతో అనుమతులు తీసుకుని 172లో నిర్మాణాలు చేశారన్నారు. ఇలాంటి వాటిని 22ఏలో పెట్టకూడదా..? అని ప్రశ్నించారు. మేడ్చల్‌ జిల్లా పర్వతాపూర్‌ ప్రాంతంలో రెవెన్యూ గ్రామానికి, దానికి అనుబంధ ఆవాసానికి ఒకే తరహా సర్వే నంబర్లు కేటాయించడంతో భూ వివాదాలు తలెత్తాయని చెప్పారు. ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు.

    టోల్‌ ఫ్రీకి వచ్చిన కాల్స్‌ 1,162

    22ఏ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరుకు ఇప్పటివరకు 1,162 కాల్స్‌ వచ్చాయని పొంగులేటి వివరించారు. ఇందులో రిపీటెడ్‌ కాల్స్‌ (ఒకే సమస్య మీద వచ్చినవి) తీసివేయగా 980 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం అమాయక ప్రజలను ముందుపెట్టి.. తెర వెనుక స్వప్రయోజనాల కోసం 22ఏ వివాదాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి స్థాయిలో సర్వే చేస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.

    నకిలీ మెమోలతో భూములు కొట్టేయాలని..

    ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు నకిలీ మెమోలు సృష్టిస్తున్న వారిని గుర్తించామని మంత్రి పొంగులేటి చెప్పారు. మేడ్చల్‌ జిల్లాలో 22-4-2026 తేదీతో కలెక్టర్‌ సంతకం చేసినట్లు నకిలీ మెమో తయారు చేశారని.. అందులో కుత్బుల్లాపూర్‌ మండల పరిధిలో సర్వే నంబరు 192, 193 పరిధిలో 300గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు యత్నించారని, వీరిపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం (అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌-యూఎల్‌సీ)కి సంబంధించి కొద్ది రోజుల్లో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎస్‌-7, సీఎ్‌స-14కు సంబంధించి 2017లో అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన పత్రిక ఎండీ ఒక భూస్వామి నుంచి ఎస్‌ క్లాస్‌ బెంజ్‌ కారు తీసుకుని 5 డాక్యుమెంట్ల ద్వారా 811 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న అంశంపై ప్రధాన ప్రతిపక్షం కోరితే దర్యాప్తునకు ఆదేశిస్తామన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement