త్వరలోనే లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు: మంత్రి నారాయణ
అమరావతి : రైతుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో ప్రధానంగా చర్చించామని మంత్రి నారాయణ అన్నారు. రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ...700 మంది రైతులకు చెందిన 921 ప్లాట్లు ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని భూమిలో వచ్చాయని.. అలాంటి రైతులకు ఫోన్‌లు చేసి వారి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. చాలా మంది రైతులు ల్యాండ్ అక్విజిషన్ తర్వాత అవే ప్లాట్లు తీసుకుంటామని చెప్పారని తెలిపారు.
37 మంది రైతులు వేరే చోట ప్లాట్లు కేటాయించమని అడిగారన్నారు. జరీబు, గ్రామ కంఠం ప్లాట్లపై కమిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఇప్పటి వరకూ 61,793 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు. ఇంకా కేవలం 7628 ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని వెల్లడించారు. 29,233 మంది రైతులకు ప్లాట్లు అలాట్‌మెంట్ జరిగిందన్నారు. 312 కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
వీధి పోటు, వారసత్వ సమస్యలు, ఎన్‌ఆర్‌ఐల వల్ల కొన్ని రిజిస్ట్రేషన్‌లు జరగలేదని చెప్పుకొచ్చారు. ఉండవల్లిలో భూమి ఇచ్చిన రైతులకు త్వరలో లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఆర్ 5 జోన్‌పై న్యాయ సలహా తీసుకుంటున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.










Comments