పాతికేళ్లకే బ్రెయిన్ స్ట్రోక్..
హైదరాబాద్ : పక్షవాతం వయస్సు పై బడిన వారికే వస్తుందనుకుంటాం. అది ఒకప్పటి మాట. ప్రస్తుతం పాతికేళ్ల వయస్సు వారిని కూడా బ్రెయిన్‌స్ట్రోక్ ముప్పు తిప్పలు పెడుతోంది. మానసిక, పని ఒత్తిడితో చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అందరికీ మెదడు ఆరోగ్యం అందుబాటులోకి అనే అంశంతో ‘ప్రపంచ మెదడు దినోత్సవం’ను పురస్కరించుకుని న్యూరో నిపుణులు ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
దేశంలో ఏటా 12.5 లక్షల కొత్త కేసులు
దేశంలో ఏటా సుమారు 12.5 లక్షల కొత్త స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 340 కోట్ల మందికిపైగా నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రతీ ఏడాది 1.1 కోట్లకుపైగా మరణాలకు ఇవే కారణమవుతున్నాయి. వైకల్యానికి కూడా ఇవే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని వైద్యులు వివరించారు.
రోజుకు 10 మంది పక్షవాతంతో..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 10మంది పక్షవాత సమస్యలతో వైద్యులను ఆశ్రయిస్తున్నారు. 20 నుంచి 40 ఏళ్ల వయస్సు వారిలో 15 నుంచి 20 శాతం, 40 నుంచి 60 ఏళ్ల లోపు వారిలో 30 శాతం, 60 ఏళ్లు పైబడిన వారిలో 50 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
నిమిషానికి 19 లక్షల మెదడు కణాలు..
ప్రతీ నిమిషం ఆలస్యం మెదడుకు నష్టం. చికిత్స అందని ప్రతీ నిమిషానికి 19 లక్షల మెదడు కణాలు దెబ్బతింటాయి. స్ట్రోక్ వచ్చిన మొదటి నాలుగున్నర గంటలు (గోల్డెన్ విండో) అత్యంత కీలకం. ఈ సమయంలో చికిత్స అందితే ప్రాణాలను కాపాడడంతో పాటు శాశ్వత వైకల్యాన్ని నివారించే అవకాశం ఉంటుంది.
బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ఆఫీసుల్లో ఎక్కువ గంటలు పనిచేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలి.
అరగంటకుపైగా ఒకే భంగిమలో కూర్చోకూడదు.
కూర్చుని పనిచేసే వారు వెన్నుముక నిటారుగా ఉండే విధంగా చూసుకోవాలి.
తలవెనుక భాగంలో తరుచుగా నొప్పి ఉన్నట్లు ఉంటే వెన్నుపై భారం పడుతున్నట్లు భావించాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని భాగాలతో పాటు మెదడుకు రక్తప్రసరణపై ప్రభావం పడుతోంది.
రోజూ కనీసం గంటసేపు వ్యాయమం చేయాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
అధిక బరువు, హైపర్‌టెన్షన్, మధుమేహం వంటి సమస్యలు ఉంటే తరచూ ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలి.
కంప్యూటర్లపై పనిచేసే వారు అరగంటకు ఒకసారి శరీరంలోని మిగిలిన భాగాల్లో కదలిక ఉండే విధంగా జాగ్రత్త పడాలి.
మాట తడబడటం స్ట్రోక్ సంకేతాలు
తలనొప్పి, మాట తడబడటం స్ట్రోక్ సంకేతాలు. అకస్మాత్తుగా ఒకవైపు చేయి లేదా కాలు బలహీనంగా అనిపించడం, తిమ్మిరి, మాటసరిగా రాకపోవడం, చూపు తగ్గిపోవడం, కారణం లేకుండా మూర్చ రావడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు. ఇటీవలి కాలంలో యువతలోనూ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయి. చాలామంది పక్షవాతం వచ్చిన తర్వాత లేదా మాట్లాడలేని, నడవలేని స్థితికి చేరుకున్న తర్వాత ఆస్పత్రులకు వస్తున్నారు. మరికొందరు ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి మారుతూ స్ట్రోక్‌కు గోల్డెన్ టైమ్ కోల్పోతున్నారు.










Comments