బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక
అమరావతి (ఎన్ పి ఎన్ న్యూస్):
బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడన అలజడి మొదలైంది. ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో త్వరలోనే అల్పపీడనం ఆవిర్భవించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ క్రమంగా బలపడనుంది.
విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు సమాచారం ప్రకారం:
- సోమవారం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
- మంగళవారం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడి 'తీవ్ర వాయుగుండం'గా మారనుంది.
- బుధవారం: దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమ మధ్య/వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకుంటుంది.
ప్రజలు, మత్స్యకారులకు హెచ్చరికలు:
ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు.
ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని, కొత్తగా ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు, తీరప్రాంత నివాసితులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని కోరారు.










Comments