బీఫాస్ట్ అదే విజయమంత్రం
దేశంలో బ్రెయిన్ స్ర్టోక్ వైద్య సేవల్లో ఆధునిక పద్ధతులకు శ్రీకారం చుట్టిన ప్రముఖుల్లో గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ పమిడిముక్కల విజయ ఒకరు. ఇటీవల ‘వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్’ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా ఆమె ఎన్నికయ్యారు. ఒక తెలుగు వ్యక్తి ఈ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ‘నవ్య’తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు.
‘‘పక్షవాతం (బ్రెయిన్‌స్ట్రోక్ వైద్య ప్రపంచ దేశాలకు పెను సవాల్‌గా మారింది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పక్షవాతంపై ప్రజల్లో సరైన అవగాహన లేదనే చెప్పాలి. వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుండటం, జీవనశైలిలో శరవేగంగా వచ్చిన మార్పులు, స్థూలకాయం, శారీరక శ్రమలేని జీవనం, మానసిక ఒత్తిళ్లు, అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, మద్యపానం, నిద్రలేమి లాంటి పలు కారణాలు పక్షవాతానికి కారణమవుతున్నట్టు ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ స్టడీ’లో తేలింది. అయితే... ముందస్తు నివారణ చర్యలతో 80 శాతం కేసుల్లో పక్షవాతం నివారించే అవకాశం ఉంది. ప్రజల్లో ఈ విషయంపై తగినంత అవగాహన లేకపోవడంతో కేసులు పెరుగుతున్నాయి.
2015 నాటితో పోలిస్తే నేడు బ్రెయిన్ స్ట్రోక్ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. స్ట్రోక్ తరువాత చికిత్సలకే చాలా వ్యయం అవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాధి నివారణపై అందరం దృష్టి సారించాలి. వైద్య చికిత్సలు, పునరావాసం లాంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. పక్షవాతానికి దారితీసే కారణాలను నియంత్రించడం ద్వారా గుండె జబ్బులు, కేన్సర్, డిమెన్షియా (మతిమరుపు) తదితర అనారోగ్య సమస్యలను కూడా నివారించవచ్చు. ప్రజల్లో బ్రెయిన్ స్ట్రోక్ నివారణపై తగినంత అవగాహన కల్పించడమే ‘వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్’ (డబ్ల్యూఎ్‌సవో) ప్రధాన లక్ష్యం.
సదుపాయాలు అందుబాటులోకి రావాలి
పక్షవాత లక్షణాలను కుటుంబ సభ్యులు గుర్తించాలి. ఇందుకోసం ‘బీఫాస్ట్’ అనే పదం గుర్తు పెట్టుకోవాలి. బీ: బ్యాలెన్స్ (నడక), ఈ: ఐ (కన్ను), ఎఫ్: ఫేస్ (ముఖం), ఏ: ఆర్మ్ (చేయి), ఎస్: స్పీచ్ (మాట), టీ: టైం (సమయం). పక్షవాతం రాగానే మూతి వంకరపోవడం, కాళ్లు, చేతులు చచ్చుబడటం, మాట ముద్దగా రావడం, నడక తూలడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తిస్తే రోగిని వెంటనే సమీపంలో స్ట్రోక్ యూనిట్ సౌకర్యం ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలి. బ్రెయిన్ స్ట్రోక్ వైద్యపరమైన ఒక అత్యవసర స్థితి. ఈ రోగులను ఐసీయూలో ఉంచి చికిత్సలు చేయాలి. వీటిని ‘స్ట్రోక్ యూనిట్స్’ అంటారు. వీటిలో న్యూరాలజిస్టులతోపాటు సీటీ స్కాన్ మెషీన్, ఐసీయూ అందుబాటులో ఉంటాయి. వీటిని ‘ప్రైమరీ స్ట్రోక్ సెంటర్’ అంటారు. ఈ మౌలిక సదుపాయాలు ప్రతి జిల్లాలో అందుబాటులోకి రావాలి. ఇందుకోసం డబ్ల్యూఎ్‌సవో మార్గదర్శకాలను మన దేశంలోనూ అమలు చేయాలి. పక్షవాత రోగినిసరైన సమయంలో, సరైన డాక్టర్ దగ్గరకు, సరైన సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లడం ముఖ్యం. ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎయిర్ అంబులెన్స్‌లు ఉంటాయి. స్ట్రోక్ అంబులెన్స్‌లు ఉంటాయి. ఆ వాహనంలోనే సీటీ స్కాన్ ఉంటుంది. రోగికి వాహనంలోనే సీటీ స్కాన్ తీసి, శాటిలైట్ ద్వారా పెద్ద సెంటర్‌లో ఉన్న వైద్యులకు పంపుతారు. వాటిని వైద్యులు పరిశీలించి... పారా మెడికల్ సిబ్బందికి చికిత్సను సూచిస్తారు. సిబ్బంది వెంటనే టెనెక్టికట్ ఇంజెక్షన్‌ను ఇచ్చి రోగి ప్రాణాలు కాపాడుతున్నారు. మన దేశంలో ఈ విధానాన్ని చౌకగా అమలు చేసే విఽధానాలను అన్వేషించాలి.
కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీ సాయంతో...
శిక్షణ పొందిన వైద్య సిబ్బందిని తయారు చేయడం డబ్ల్యూఎ్‌సవో మరో లక్ష్యం. వైద్యుల నుంచి నర్సులు, పారా మెడికల్ సిబ్బంది వరకు అందరికీ శిక్షణ ఇవ్వాలి. ఇందుకోసం నిరంతర వైద్య విద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పక్షవాతం బారిన పడిన రోగికి తొలి నాలుగున్నర గంటల్లో (గోల్డెన్ అవర్) చికిత్సలు అందించే సౌకర్యం అందుబాటులోకి రావాలి. ఇందుకోసం కృత్రిమ మేధను, డిజిటల్ ఆధారిత సాంకేతికతను, యాప్‌లను వాడుతున్నారు. ఢిల్లీలో డిజిటల్ బేస్డ్ యాప్ సాయంతో పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన స్ట్రోక్ చికిత్సలు సత్ఫలితాలను ఇచ్చాయి. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా టెలీ మెడిసిన్ ద్వారా... ఆశా వర్కర్ల భాగస్వామ్యంతో చేసిన ప్రయోగం కూడా మంచి ఫలితాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లా ఆసుపత్రుల్లో ఇప్పుడు సీటీ స్కాన్‌లు అందుబాటులోకి వచ్చాయి. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు పునరావాసంచాలా ముఖ్యం. ఒకసారి పక్షవాతం బారిన పడిన రోగి మళ్లీ దానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని... ఇంట్లోనే శారీరక వ్యాయామాలు చేసుకొనేలా అవగాహన కల్పిస్తాం. వీరు జీవితాంతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు తీసుకుంటూ ఉండాలి.
ఉచిత శిక్షణ కార్యక్రమాలు...
పక్షవాతం నివారణ, చికిత్సలలో నైపుణ్యాల అభివృద్ధి అవసరం. చాలామంది యువ న్యూరాలజిస్టులు బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సల మీద అంతగా దృష్టి పెట్టడం లేదు. రోగుల చికిత్స సమయంలో 24 గంటలూ అందుబాటులో ఉండాల్సి రావడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో... యువ వైద్య నిపుణుల కోసం ఆన్‌లైన్ శిక్షణ తరగతులను డబ్ల్యూఎ్‌సవో నిర్వహిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లకు మెకానికల్ థ్రాంబెక్టమీ లాంటి సర్జరీల్లో ఉచితంగా ఆన్‌లైన్ శిక్షణ నిర్వహిస్తోంది. దీని వల్ల బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలు చేసే వైద్యనిపుణుల సంఖ్య పెరుగుతుంది. చిన్న దేశమైన నేపాల్‌లో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు చక్కటి ఫలితాలను ఇస్తున్నాయి. పబ్లిక్ ఎడ్యుకేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది, వైద్య సిబ్బందికి శిక్షణతో పాటు ఆయా దేశాల ప్రభుత్వాలు ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో నిధులు పెంచేలా డబ్ల్యూఎస్ సంప్రదింపులు జరుపుతోంది. ఆరోగ్య రంగంలో పనిచేసే స్వచ్ఛంద, ప్రభుత్వ రంగ సంస్థలతో సంప్రదింపుల ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని నమ్ముతున్నాం. డబ్ల్యూఎ్‌సవో నూతన బోర్డు తొలి సమావేశంలో పాల్గొనడానికి ఈ ఏడాది అక్టోబర్‌లో దక్షిణ కొరియాలోని సియోల్‌కు వెళ్తున్నాను. బ్రెయిన్ స్ట్రోక్‌పై ప్రజావగాహన పెంచేందుకు చేపట్టాల్సిన పలు అంశాలపై ఆ సమావేశంలో చర్చ జరుగుతుంది. పక్షవాత చికిత్సారంగంలో సాగుతున్న నూతన పరిశోధనలపై కూడా చ ర్చిస్తాం.’’










Comments