• Sep 20, 2026
  • NPN Log

    నస్పూర్‌(మంచిర్యాల): వ్యవసాయ రంగంలో కీలక భూమికను పోషిస్తూ ఆరుగాలం రైతన్నల జీవితంతో పెనవేసుకుని, సేధ్యంలో ప్రకృతితో పాటు పశుపక్ష్యాదులపై ఆధారపడి తమ సాగులో సాయపడిన వాటిన్నింటిపై ఆపేక్షను కలిగి ఉంటాడు అన్నదాత. పంటల సాగులో సాయం చేసిన పశు సంపదను దేవుడిగా పూజించడం రైతన్నల మహోన్నత ప్రేమకు నిదర్శనం. సిరులు పండించే నేలతల్లిని భూమాతగా, వానను వరుణ దేవుడిగా రైతన్నలు పూజించడం తరతరాలుగా ఆన వాయితీగా వస్తోంది. పంటల సాగులో తోడుగా నిలిచిన పంచభూతాలతో పాటు కాడెద్దులను నందీశ్వరులుగా భావించి రైతులు ప్రత్యేక పూజలు చేస్తారు.

     

    గ్రామీణ ప్రాంత అస్థిత్వాన్ని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు విడమరిచి చెప్పే పద్ధతిని ఎల్లప్పుడు రైతన్నలు పాటిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ఆరుగాలం శ్రమించే రైతన్నకు బాసటగా నిలిచిన ఎద్దుల జతలకు ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో బహుళ పక్ష అమావాస్య రోజున ఆచరిస్తారు. శ్రావణ మాసం గ్రామాల్లో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, గ్రామాల్లో ఎడ్లతో ఉరేగింపులు నిర్వహించ డంతో ఎద్దుల పండగ వైభవోపేతంగా నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో ఆఖరి పండగ ఈ నెల 11న పొలాల అమావాస్యను జిల్లాలో ఆనందోత్సావాల మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

    బసవన్నల ముస్తాబు..

    పొలాల అమావాస్య పండగ రోజున బసవన్నలను అలంకరణతో ముస్తాబు చేస్తారు. రైతులకు పశువు లతో ఉన్న అనుబంధాన్ని, ప్రేమను చాటుకుంటారు.

    తెలంగాణ పల్లెపల్లెనా వేడుకగా సాగే పొలాల అమావాస్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అన్నదాతలు బసవేశ్వరుడిగా కొలిచే పద్ధతి తర తరాల ఆనవాయితీగా కొనసాగుతుంది. తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం పరుచుకుని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు పెట్టి అంతకు ముందుగ ఎద్దులను, పశువులను చెరువు, బావి వద్దకు తీసుకెళ్లి స్నానం చేయించి పూజ విధానాన్ని మొదలు పెడతారు. పూజలో పుల్లగంధ (కంధ)ను వినియోగిస్తారు. పుల్లగంధల వ్యవసాయం, తమ సంతతి వృద్ధి చెందాలని భావించి ప్రత్యేక పూజల్లో వేడుకుంటారు.

    అమావాస్యకు ముందు రోజున ఎడ్ల జతలను పసుపు, కుంకుమలతో అలంకరించి మంగళ హారతులతో పూజలు చేయడం, మరుసటి రోజున మట్టితో ఎద్దులను తయారు చేసి పూజలు చేస్తారు. అలంకరిం చిన ఎద్దులను గ్రామాల్లోని హనుమాన్‌ దేవాలయం వద్ద తీసుకెళ్లి ఆలయం చుట్టూ ప్రద క్షిణలు చేయించడం, వెంట తెచ్చిన పిండి వంటలు, నైవేద్యాన్ని ఎద్దులకు పెడుతారు. బసవన్నల వల్ల అనేక ఉత్పత్తులు వస్తున్నాయని భావించి దీని కారణంగా రైతులు ఎద్దులను అలంకరణ చేసి ప్రత్యేకంగా పూజిస్తారు. పండగ రోజున ఎద్దులకు పూజలు చేస్తే పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని రైతులు భావిస్తారు. వ్యవసాయానికి ఆయువు పట్టుగా నిలిచిన ఎద్దులు తమకు కష్టనష్టాల్లో తోడునీడగా ఉంటాయని రైతులు ప్రత్యేకంగా పూజిస్తారు. పూజల సందర్భంగా బూరె లు, నైవేద్యాలను పెడుతారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement