• Jul 27, 2026
  • NPN Log

    రెండు రకాల విటమిన్‌ బి12 సప్లిమెంట్ల విషయంలో మనం పొరపాటు పడుతూ ఉంటాం. నేరుగా శోషించుకునే బి12తో పాటు, మన శరీరం బి12గా మార్చుకుని ఉపయోగించుకునే రెండు రకాల సప్లిమెంట్లు ఉంటాయి. ఎవరు, దేన్ని ఎంచుకోవాలో తెలుసుకుందాం!

    ఆన్‌లైన్‌లో వెతికినా, ఫార్మసీలో వాకబు చేసినా మనకు ‘మిథైల్‌కొబాలమిన్‌’, ‘సయనోకొబాలమిన్‌’ అనే రెండు రకాల బి12 సప్లిమెంట్లు కనిపిస్తాయి. ఈ రెండింట్లో ‘మిథైల్‌కొబాలమిన్‌’ సప్లిమెంట్‌ మెరుగైన సప్లిమెంట్‌గా ఆదరణ పొందుతూ ఉంటుంది. మనకున్న ఆరోగ్య, పోషక అవసరాల ఆధారంగా, వైద్యుల సూచన మేరకు సరైన సప్లిమెంట్‌ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు ముంబయిలోని గ్లెండేల్‌ ఆస్పత్రి, సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ అనూప్‌ ఖత్రి.

    తేడా ఉంది: రెండూ పోషక లోపాన్ని భర్తీ చేసే విటమిన్‌ బి12 సప్లిమెంట్లే అయినప్పటికీ, ‘మిథైల్‌కొబాలమిన్‌’ రూపంలో ఉన్న విటమిన్‌ 12ను మన శరీరం నేరుగా ఉపయోగించుకుంటుంది. కాబట్టి నాడీ సంబంధ సమస్యలకు వైద్యులు ఈ సప్లిమెంట్‌ను సూచిస్తూ ఉంటారు. అలాగే సాధారణ విటమిన్‌ బి12 లోపాన్ని భర్తీ చేయడం కోసం ‘సయనోకొబాలమిన్‌’ను సూచిస్తూ ఉంటారు. విటమిన్‌ బి12 లోపం వల్ల అలసట, నిస్సత్తువ వేధిస్తున్నప్పుడు ‘మిథైల్‌కొబాలమిన్‌’ లేదా ‘సయనోకొబాలమిన్‌’ ఈ రెండింట్లో ఏదైనా సమస్యను పరిష్కరిస్తుంది. అయితే అప్పటికే ఈ విటమిన్‌ మోతాదులు సాధారణ స్థాయిలో ఉన్నవారికి ఈ రెండు సప్లిమెంట్ల వల్ల శక్తి మోతాదులు పెరగడం లాంటి అదనపు ప్రయోజనం ఉండదు.

    ప్రమాదం లేదు: సయనోకొబాలమిన్‌ బి12 సప్లిమెంట్‌లో స్వల్ప మోతాదులో సయనైడ్‌ ఉన్నంత మాత్రాన ఈ సప్లిమెంట్‌ తీసుకోడానికి భయపడవలసిన అవసరం లేదు. దీన్లో ఉండే ఈ సయనైడ్‌ను మన శరీరం సురక్షితంగా తొలగించేస్తుంది. బి12 లోపాన్ని భర్తీ చేయడం కోసం వైద్యులు, సయనోకొబాలమిన్‌ను కొన్ని దశాబ్దాలుగా సూచిస్తున్నారు. కాబట్టి కంగారుపడవలసిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు డాక్టర్‌ ఖత్రి.

    మెరుగైన శోషణ కోసం: విటమిన్‌ బి12

    సప్లిమెంట్‌ మెరుగైన శోషణ కోసం పరగడుపున, బ్రేక్‌ఫా్‌స్టకు అరగంట ముందు, గ్లాసు నీళ్లతో తీసుకోవాలి. ఈ సప్లిమెంట్‌ను కాఫీతో, విటమిన్‌ సి మాత్రతో, క్యాల్షియం సమృద్ధిగా ఉండే పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకున్నప్పుడు పోషక శోషణకు ఆటంకం ఏర్పడుతుంది. మెరుగైన శోషణ కోసం ఇంకొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...

    జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు లేదా పొట్టలో ఆమ్లం తక్కువగా ఉత్పత్తి అవుతున్నప్పుడు నోట్లో కరిగే మాత్రలు, డ్రాప్స్‌ రూపంలోని సప్లిమెంట్స్‌ను ఎంచుకోవచ్చు.

    మెట్‌మార్ఫిన్‌, ప్రోటాన్‌ పంప్‌ ఇన్హిబిటర్స్‌ తీసుకుంటున్న వాళ్లు, లేదా పొట్టలో ఆమ్లం ఉత్పత్తిని తగ్గించే మందులు వాడుకుంటున్నవాళ్లు, ఈ మందులకు విటమిన్‌ సప్లిమెంట్‌కూ మధ్య నాలుగు గంటల దూరం పాటించాలి.

    ఫోలేట్‌, బి6, మెగ్నీషియం లాంటి ఇతరత్రా బి విటమిన్‌ సప్లిమెంట్లతో కలిపి తీసుకోవడం వల్ల విటమిన్‌ బి12ను మరింత మెరుగ్గా శోషించుకోవచ్చు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement