• Aug 25, 2026
  • NPN Log

    అమరావతి : ఎల్‌నినో ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, రైతు ఆర్థిక భద్రతే తమ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు పంటల బీమా ద్వారా మరింత ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఖరీఫ్–2026లో ఇప్పటివరకు పంటల బీమా కోసం 35.17 లక్షల నమోదు దరఖాస్తులు రావడం రైతుల్లో బీమాపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి బీమా నమోదులో సుమారు 80 శాతం వృద్ధి నమోదైందని, ముఖ్యంగా రుణాలు తీసుకుని రైతులు బీమా పరిధిలోకి రావడం గణనీయంగా పెరిగిందని చెప్పారు.

    గతంలో రుణాలు తీసుకోని రైతుల నమోదు సుమారు 2 లక్షలు ఉండగా, ఖరీఫ్–2026లో అది ఏకంగా 20.35 లక్షలకు చేరడం ద్వారా బీమా పథకం గ్రామీణ స్థాయిలో ఎంత విస్తృతంగా చేరిందో స్పష్టమవుతోందన్నారు. పంట నష్టపోయిన సమయంలో రైతు కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా, తిరిగి సాగు ప్రారంభించేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించడమే బీమా పథకం ఉద్దేశమని మంత్రి వివరించారు.

     

    పంటల బీమా విస్తీర్ణం కూడా ఈ ఏడాది భారీగా పెరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు. గత ఖరీఫ్‌లో 7.83 లక్షల హెక్టార్లుగా ఉన్న బీమా విస్తీర్ణం ఖరీఫ్–2026లో 15.17 లక్షల హెక్టార్లకు చేరిందని, ఇది సుమారు 94 శాతం వృద్ధి అని వెల్లడించారు. బీమా విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఐదో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈసారి రైతుల పంటలకు మొత్తం రూ.13,983 కోట్ల మేర బీమా మొత్తం వర్తించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడి రైతులకు ప్రత్యేక రక్షణ కల్పించడంపై వ్యవసాయ శాఖ దృష్టి సారించిందన్నారు. ఎల్‌నినో వంటి వాతావరణ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలతో రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement