రేపే బడా గణేశ్ ఆగమన్..
హైదరాబాద్: ఖైరతాబాద్ భారీ గణపతి ఆగమన్‌కు సిద్ధమయ్యాడు. శుక్రవారం రాత్రి గణేశ్ ఆగమన్‌ను నిర్వహించేందుకు ఖైరతాబాద్‌కు చెందిన యువజన సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున విస్తృత ఏర్పాట్లు చేస్తూ పలువురిని ఆహ్వానించారు. ఇదిలా ఉండగా.. భారీ గణపతికి రంగుల అద్దకం తుది అంకానికి చేరింది. కళాకారులు గణపతి కిరీటానికి వజ్రాలు, వైఢూర్యాలు అలంకరించే పనిలో ఉన్నారు.
మరోపక్క వివిధ శాఖలు భక్తులకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే భక్తులు లైన్లలో వచ్చేందుకు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. గణేశుడి ముందుభాగంలో బారికేడ్ల ఏర్పాటు పనులు దాదాపు పూర్తికాగా రైల్వే గేటు బయట నుంచి ఖైరతాబాద్ ప్రధాన రహదారి ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు మార్గంలో సైతం ఈసారి కొత్తగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు భక్తులకు వైద్యసేవలు, సమాచార కేంద్రం, వికలాంగులు, వృద్ధులు సేద తీరే ప్రాంతంలో రేకులతో పైకప్పు వేస్తూ షెడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు.
రోజూ ప్రసాద పంపిణీ
గణపతి వద్దకు వచ్చే భక్తులకు ప్రతిరోజూ ప్రసాద పంపిణీ చేస్తున్నట్లు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ పేర్కొంది. అలాగే ఇక్కడ పని చేసే ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, ఎన్‌ఎ్‌సఎస్, ఎన్‌సీసీ కెడెట్లకు భోజనాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఈమేరకు బుధవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నివాసం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమై పలు విషయాలను చర్చించారు. ఈసారి సినీ ప్రముఖులతో పాటు అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు, పెద్ద ఎత్తున వీఐపీలు వస్తారని, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.










Comments