• Aug 25, 2026
  • NPN Log

    రష్యాలో తాజాగా జరిగిన డ్రోన్ దాడి అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీ స్థాయిలో చెలరేగిన మంటల తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మాస్కో ప్రాంతంలోని ఆన్‌లైన్ రీటెయిలర్ వైల్డ్ బెర్రీస్‌కు చెందిన ఒక గోదాముపై ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. తమకు తెలిసినంత వరకూ ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని మాస్కో ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. మాస్కోకు దక్షిణాన 45 కిలోమీటర్ల దూరంలోని కొలెడీనో అనే ప్రాంతంలోని వైల్డ్‌బెర్రీస్ సంస్థ గోదాముపై ఈ దాడి జరిగింది. డ్రోన్ దాడి అనంతరం భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిపర్వతం బద్దలైనట్టు దట్టమైన పొగలు మిన్నంటాయి. డోమోడిడోవో ప్రాంతంలోని మరో గోదాముపై కూడా దాడి జరిగినట్టు తెలుస్తోంది.

     

    శనివారం రాత్రి రష్యాపై ఉక్రెయిన్‌ భారీ స్థాయిలో డ్రోన్ దాడికి దిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అనేక డ్రోన్స్‌ను మార్గమధ్యంలోనే అడ్డుకున్నామని రష్యా ప్రకటించింది. మొత్తం 822 డ్రోన్స్‌ను ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. మాస్కో దిశగా 600 డ్రోన్స్ వచ్చాయని నగర మేయర్ తెలిపారు.

    వైల్డ్ బెర్రీస్ సంస్థకు రష్యా అమెజాన్‌గా పేరుంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వారికి రకరకాల వస్తువులను భారీ స్థాయిలో డెలివరీ చేస్తుంటుంది. అయితే, వైల్డ్‌బెర్రీస్ సంస్థ సాయంతో మిలిటరీ సామగ్రిని రష్యా తరలిస్తోందని ఉక్రెయిన్ కొంతకాలంగా ఆరోపిస్తోంది. గతంలో పలుమార్లు వైల్డ్ బెర్రీస్ సంస్థ గోదాములను ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. రష్యా మాత్రం ఈ ఆరోపణలను పలుమార్లు ఖండించింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement